ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కానరాని పురోగతి- రెండేళ్లుగా బయట తిరుగుతున్న అనంతబాబు - DRIVER SUBRAMANYAM MURDER CASE

చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలనూ ఇవ్వని గత ప్రభుత్వం- కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేస్తుందని డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం ఆశలు.

no_development_it_driver_subramanyam_murder_case_kakinada_district
no_development_it_driver_subramanyam_murder_case_kakinada_district (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 7:34 AM IST

No Development It Driver Subramanyam Murder Case Kakinada District : ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హతమార్చి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన కేసు విచారణలో పురోగతి కనిపించడం లేదు. ప్రధాన నిందితుడు అనంతబాబు మధ్యంతర బెయిల్‌పై స్వేచ్ఛగా తిరుగుతుండగా బాధిత కుటుంబం న్యాయం కోసం ఎదురుచూస్తోంది. కేసు పునర్విచారణ చేపట్టి నిందితులకు త్వరితగతిన శిక్షపడేలా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

దళిత యువకుడు, తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని 2022 మే 19న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కిరాతకంగా హతమార్చి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేయడం అప్పట్లో పెను సంచలనం రేపింది. ఈ కేసును నీరుగార్చేందుకు తొలి నుంచీ ప్రయత్నించిన వైఎస్సార్సీపీ సర్కారు హత్య జరిగిన 3 రోజులకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

శవపరీక్షలో 31 గాయాలు 3 అంతర్గత గాయాలైనట్లు తేలింది. దళిత సంఘాలు, పౌరహక్కుల సంఘాల ఆందోళనతో అనంతబాబును 2022 మే 23న అరెస్ట్‌ చేశారు. సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు అనంతబాబు ఒప్పుకున్నారని అప్పటి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డి స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత కేసు విచారణలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం చూపారు. అనంతబాబు అరాచకాలు, దోపిడీలు, అతడిపై గతంలో రౌడీషీట్‌ ఉన్న సమాచారాన్ని దాచిపెట్టి ఎలాంటి నేర చరిత్ర లేదని కోర్టుకు తప్పుడు సమాచారిమిచ్చారు. వాటిని పరిగణలోకి తీసుకుని అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం, ఆయన జైలు నుంచి విడుదలవడం జరిగిపోయాయి.

Prathidwani: అనంతబాబు డ్రైవర్ హత్య కేసు.. తేలాల్సిన నిజాలెన్ని..?

రెండేళ్లుగా అనంతబాబు స్వేచ్ఛగా బయటతిరుగుతుంటే సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు మాత్రం, న్యాయకోసం నిరీక్షిస్తున్నారు. సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ కూలీకి వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే, తల్లి నూకాలమ్మ ఇళ్లలో పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పరిహారంగా ఇస్తామన్న రెండున్నర ఎకరాల భూమి, సుబ్రహ్మణ్యం సోదరుడికి ఉద్యోగమూ ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు.

'మా కొడుకును అన్యాయంగా చంపేశారు. నింధితుడు బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. మాకు న్యాయం కావాలి. నేను ఇల్లలో పని చేస్తూ మా ఆయనను వాళ్ల అమ్మను చూసుకుంటున్నాను. మా చిన్న కొడుకుకు ఉద్యోగం ఇస్తా అన్నారు అదీ ఇవ్వలేదు. పింఛన్​ కూడా ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.' -సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు

ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు బాధిత కుటుంబానికి అండగా న్యాయపోరాటం చేస్తున్నారు. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి ఇదే విషయాన్ని విన్నవించారు. వైఎస్సార్సీపీ పాలకులు నీరుగార్చిన కేసును పునర్విచారణ చేయాలని కోరుతున్నారు అనంతబాబు నేరచరితను పరిగణలోకి తీసుకుని త్వరితగతిన శిక్షపడేలా చూడాలని ముప్పాళ్ల సుబ్బారావు కోరుతున్నారు.

AP High Court on MLC Anantha Babu Case సీసీ ఫుటేజ్‌లో ఉన్న వ్యక్తుల పాత్రను అభియోగపత్రంలో ఎందుకు ప్రస్తావించలేదు?

ABOUT THE AUTHOR

...view details