Nitin Gadkari on Funds for Roads: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన రహదారుల పనులు ఇకపై శరవేగంగా పూర్తి కానున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన సత్ఫలితాలను ఇస్తుంది. ఏపీలో రహదారుల అభివృద్ధికి కేంద్రం 400 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో 200.06 కిలో మీటర్ల పొడవైన 13 రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (CRIF) నుంచి 400 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెల్లడించారు. గుంటూరు-నల్లపాడు రైల్వే మార్గంలో 98 కోట్ల రూపాయలతో ఆర్వోబీని 4 వరుసలతో నిర్మించడానికి ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.
ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్రమంత్రిని కలిసి రాష్ట్ర అవసరాల గురించి చర్చించిన నేపథ్యంలో తాజాగా ప్రకటన వెలువడింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పురోగతికి మరింత ఉపయోగపడుతాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
పల్లె పరవశించేలా కొత్త రోడ్లు - పాతవాటి మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం - NDA Govt Decision for New Roads
మరోవైపు తెలంగాణకి సైతం నిధులను విడుదల చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. జాతీయ రహదారి 565లో నల్గొండ పట్టణం గుండా సాగే నకిరేకల్ - నాగార్జునసాగర్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 516 కోట్ల రూపాయలతో 14 కిలో మీటర్ల మేర 4 వరుసల బైపాస్ రోడ్డు నిర్మించనున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల అనుసంధానానికి ఈ జాతీయరహదారి అత్యంత ప్రధానమైనదని గడ్కరీ పేర్కొన్నారు. తెలంగాణలోని నకిరేకల్ కూడలి నుంచి మొదలయ్యే ఈ జాతీయ రహదారి నల్గొండతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల, ఎర్రగొండపాలెం, కనిగిరి మీదుగా సాగుతుందని వివరించారు. ప్రస్తుతం నల్గొండ నుంచి సాగే సెక్షన్‌లో భారీగా వాహనాల రద్దీ నెలకొంటోందని, తాజాగా మంజూరుచేసిన బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు.
అదే విధంగా నకిరేకల్ - నాగార్జునసాగర్ మధ్య అనుసంధానం మెరుగవుతుందని, సురక్షితమైన ప్రయాణానికి దోహదం చేస్తుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.
పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్ - ఇక పనులు రయ్ రయ్ - NHAI on Amaravati ORR Project