తెలంగాణ

telangana

ETV Bharat / state

17- 57- 77 - క్రికెట్ స్కోర్​ కాదు -'కెరీర్​' స్కోర్ - అ'పూర్వ' ఘట్టం చూసి తీరాల్సిందే

57 సంవత్సరాల తరువాత కలుసుకున్న 1966-67 హెచ్ఎస్సీ బ్యాచ్​ మిత్రులు - వృద్ధాప్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

GET TOGETHER AFTER 57 YEARS NIRMAL
Old Men HSC Batch Get together after 57 years in Nirmal (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2024, 9:50 PM IST

Old Men HSC Batch Get together after 57 years in Nirmal :ఇండియా- దక్షిణాఫ్రికా క్రికెట్ మ్యాచ్లు నడుస్తున్నాయి. ఇవి వాటికి సంబంధించిన అంకెలేమోనని ఆలోచిస్తున్నారా! అబ్బే అదేం కాదండి. ఇది పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో ముడిపడిన విషయం. ఈ అంకెలు, వాటి వెనకున్న ప్రత్యేకత తెలిస్తే సంబరపడిపోతారు. 17 సంవత్సరాల వయసులో చదువుకుని విడిపోయారు, 57 సంవత్సరాల తరువాత ఇవాళ కలుసుకున్నారు. వారికి ఇప్పుడు సుమారుగా 77 సంవత్సరాల వయసుంటుంది. నిర్మల జిల్లా కేంద్రంలోని జుమ్మెరాత్పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అది. ప్రస్తుతం పదోతరగతి వరకే ఉంది.

గతంలో హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రస్తుత ఇంటర్మీడియట్​తో సమానంగా ఉండేది. ఈ పాఠశాలలోనూ అలా హెచ్ఎస్సీ 1966- 67 బ్యాచ్​లో చదువుకున్నవారంతా అప్పుడు దాదాపు 17 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్నారు. చదువు పూర్తయ్యాక విడిపోయారు. అనంతరం వివిధ ఉద్యోగాలు, వ్యాపారాల్లో కొనసాగారు. పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అందరూ వృద్ధాప్య దశకు చేరుకున్నారు. ఈ సమయంలో నాడు చదువుకున్న మిత్రులంతా ఒకచోట చేరితే బాగుంటుంది కదా అనే ఆలోచన చేశారు. అలా రూపుదిద్దుకున్నదే ఈ సమ్మేళనం. నాడు కలిసి చదువుకున్న స్నేహితులు 57 సంవత్సరాల తర్వాత అంటే వారి 77 సంవత్సరాల వయసులో మళ్లీ ఇవాళ ఒకచోట చేరి సందడి చేశారు.

నెలరోజుల ప్రయత్నంతో : ఈ నేపథ్యంలో శారీరకంగా వయసు కాస్త సహకరించకపోయినా మానసికంగా వారంతా పిల్లలైపోయారు. ఆనందంగా నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. నిర్మల్ ఆర్టీసీలో డీఎంగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కిషన్ తనకు వచ్చిన ఈ ఆలోచనను తన మిత్రులతో పంచుకున్నారు. వారు కూడా సరేననడంతో అందరూ సమ్మేళనానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఫోన్లు, వాట్సప్, ఫేస్​బుక్ ఇలా అందుబాటులో ఉన్నవాటి సాయంతో అందరికీ సమాచారం అందించారు. మొత్తం 68 మందికి సమాచారం చేరగా సుమారు 50 మంది సమ్మేళనానికి హాజరయ్యారు. స్థానిక ఎఎన్.రెడ్డి కాలనీలోని కమిటీహాల్​లో సమ్మేళనం నిర్వహించారు.

కుటుంబసభ్యుల సహకారంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలో ఒక్కొక్కరుగా వృద్ధులు అక్కడకు చేరుకోవడం చూసి స్థానికులు విస్తుపోయారు. ఏం జరుగుతుందోనని ఆరాతీశారు. అసలు విషయం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు. అందరూ ఒకచోట చేరాక పరిచయాలు చేసుకుని నాటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. ప్రస్తుత విశేషాలు, కుటుంబ సమాచారం పంచుకున్నారు. ఈ నేపథ్యంలో మృతిచెందిన వారికి సంతాపం ప్రకటించారు. అనంతరం ఆహుతులందరినీ సన్మానించి జ్ఞాపికలు బహూకరించారు. వృద్ధాప్యంలో ఉన్న మిత్రులే కాదు, నాడు వారికి బోధించిన లింబగిరి, నర్సయ్య అనే ఇద్దరు ఉపాధ్యాయులు సైతం ఈ వేడుకలో భాగమవడం మరో విశేషం. వారిని సైతం ఆత్మీయంగా సత్కరించారు.

ఒక్కరిని పిలిస్తే 100 మంది పలుకుతారు! - అక్కడ అందరూ శ్రీనివాసులే - Srinivas Name Persons at one place

గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలో హోమ్‌ కమింగ్‌ కార్యక్రమం - ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మురిసిపోయిన విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details