New Year Events In Hyderabad :హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకల తీరే వేరు. ప్రతీ సంవత్సరం కొత్త థీమ్‌లతో నిర్వాహకులు ఈవెంట్లను చేస్తారు. ఫేమస్ సింగపర్స్తో, సినీ తారలతో, గ్లామరస్ కార్యక్రమాలతో జనాలను ఉర్రూతలూగిస్తారు.ఈ వేడుకల్లో సంగీతమే ప్రధానం కావడంతో డీజేలు కేంద్రంగానే పార్టీలను డిజైన్ చేస్తారు. ఈ పార్టీల్లో పాల్గొని ఎంజాయ్ చేసేందుకు కుర్రకారు స్నేహితులతో కలిసి వస్తుంటారు. వారిని ఆకట్టుకునేందుకు ఈవెంట్ మేనేజర్లు పేరున్న డీజేలను నగరానికి రప్పిస్తున్నారు. ఈవెంట్ల సంఖ్య కూడా గతం కంటే ఈసారి పెరిగింది.
న్యూ ఇయర్ పార్టీ ఉంది పుష్పా :31 వేడుకలకు, 2025లోకి అడుగు పెట్టేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఏడాదిలో అందరూ కలిసి జరుపుకొనే వేడుక రానే వచ్చింది. 2024కి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికేందుకు పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు పార్టీ ఎక్కడ పుష్పా అంటూ వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల ఎవరి స్థాయిలో వారు వేడుకలు నిర్వహించుకునేందుకు గెస్ట్‌హౌస్‌లు, రిసార్టులు బుక్ చేసుకున్నారు. పార్కులు, క్లబ్‌లు, పబ్‌లు, స్టార్ హోటల్స్, శివార్లలోని కన్వెన్షన్ హాళ్లు వేడుకలకు ముస్తాబయ్యాయి. గేటెడ్ కమ్యూనిటీల్లోనూ భారీ ఎత్తున వేడుకలతో సందడి చేసేందుకు అసోసియేషన్లు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.