Cyber Crimes in NTR District :సైబర్ నేరాల్లో ఒక చోట రూ.లక్షలు, మరో చోట రూ.వేలు మోసపోయారని మనం నిత్యం వింటూనే ఉంటాం. అయితే మోసగాళ్ల ఆగడాలు లక్షల్లోనే ఉన్నాయనుకుంటే పొరపాటే. చివరకు చిల్లర రూపాయిల వద్ద కూడా వీరి జిమ్మిక్కులకు అంతులేకుండా పోయింది. పండ్ల దుకాణాలు, టిఫిన్ కొట్లు, రద్దీ ఉండే చిల్లర దుకాణాలు సైతం ఈ మాయగాళ్లకు వేదికలయ్యాయి.
కొంత మొత్తంలో కొనుగోలు చేస్తూ దుకాణదారుడు బిజీగా ఉన్న సమయంలో స్కానర్ ద్వారా డబ్బులు పంపామని చెప్పి తన ఫోన్‌లో ఉంచిన నకిలీ యాప్ ద్వారా వాటిని చూపి అక్కడ నుంచి జారుకుంటున్నారు. ఇటువంటి మోసాలు పురపాలికలో కొన్ని రోజులుగా సాగుతున్నాయి. దుకాణదారులు విరివిరిగా వాడే నగదు బదిలీ చేసే నకిలీ యాప్‌లు విపరీతంగా వచ్చాయి. వీటి సాయంతో చెలరేగిన మోసగాళ్లు, ఆకతాయిలు తమ విన్యాసాలను చూపిస్తూ చిరు వ్యాపారులను మోసం చేస్తున్నారు.
- ఇబ్రహీంపట్నం రింగుకూడలిలోని ఓ పండ్ల దుకాణం వద్ద రూ.120తో యాపిల్ పండ్లు కొనుగోలు చేసిన యువకుడు అక్కడున్న స్కానర్‌తో తన చరవాణిలో నుంచి నగదును పంపినట్లు దుకాణదారుడికి చూపాడు. సాయంత్రానికి పండ్ల దుకాణ యాజమాని ఫోన్ చూసుకోగా రూ.120 వచ్చినట్లు కనిపించలేదు. ఎంత సేపు ఆలోచించినా నగదు ఎందుకు రాలేదో అర్థంకాక అయోమయానికి గురయ్యాడు.
- కొండపల్లిలోని ఓ పచారీ దుకాణం వద్దకు వెళ్లిన ఓ యువకుడు రూ.400లకు సరుకులు కొనుగోలు చేశాడు. తన చరవాణి నుంచి అక్కడ ఉన్న స్కానర్‌కు ఆ నగదును పంపినట్లు తన ఫోన్‌లో దుకాణ యాజమానికి చూపాడు. ఆ సమయంలో స్కానర్ శబ్ద యంత్రం మోగలేదు. తర్వాత వస్తుందిలే అని వదిలేశాడు. అనుమానం వచ్చి అదే రోజు రాత్రి తిరిగి తన ఫోన్‌పే ఖాతాను సరిచూసుకోగా యువకుడు పంపిన రూ.400 రాలేదు. దీంతో మోసపోయానని లబోదిబోమన్నాడు.