Problems from Transport Dept for New RTC Buses:కొత్త బస్సుల రిజిస్ట్రేషన్ల విషయంలో ఆర్టీసీకి రవాణా శాఖకు మధ్య కొత్త పేచీ నెలకొంది. దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో అగ్నిప్రమాదాల గుర్తింపు, నివారణ పరికరాలు కచ్చితంగా ఉండాలి. ఇంక ఇంజిన్‌లోగానీ, బస్సు లోపల గానీ ఎక్కడైనా పొగలు వచ్చినా, మంటలు చెలరేగినా వెంటనే గుర్తించి అలారంతో హెచ్చరిస్తుంది. ఇంతకాలం ఈ పరికరం ఏర్పాటు విషయంలో రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటూ చూసీచూడనట్లు వదిలేశారు.
అయితే కొద్దినెలల క్రితం ఈ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) నుంచి ఆదేశాలొచ్చాయి. దీంతో రవాణాశాఖ అధికారులు రోజుకు 250 కిలోమీటర్లకు పైగా తిరిగే బస్సులు, విద్యాసంస్థల వాహనాల్లో ఈ పరికరం కచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఆర్టీసీ పోయిన సంవత్సరం 1,489 బస్సులను కొనుగోలు చేసింది. వీటిలో దూరప్రాంత సర్వీసులైన ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు విడతలవారీగా బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకొని నిర్దేశిత ప్రాంతాలకు చేరుతున్నాయి. వీటిలో అగ్నిప్రమాద నివారణ పరికరాలు లేకపోవటంతో ఆయాచోట్ల రవాణా శాఖ అధికారులు రిజిస్ట్రేషన్లు చేయకుండా తిరస్కరిస్తున్నారు.