New Ration Cards in Telangana :తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను పొందడానికి తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో.. జనం దృష్టంతా కొత్త రేషన్ కార్డుల(Ration Cards) జారీపై పడింది. అలాంటి వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. ఇప్పటికే కొన్ని పథకాలను అమలులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిశాక మరికొన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ఇచ్చిన హామీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
ఏం ప్రకటన చేశారంటే..నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి మంత్రి పొన్నం చేసిన ఈ ప్రకటన శుభవార్తే అని చెప్పుకోవచ్చు. అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే.. సీఎం రేవంత్రెడ్డి కూడా కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.