Cycle Yatra to Save Environment Motive:నేటి సమాజంలో మానవ స్వలాభం కోసం ప్రకృతి విచ్ఛిన్నం జరుగుతోంది. దీని వల్ల వచ్చే పరిణామాలతో కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు కొల్పోవడం చూశాం. అలాంటి విపత‌్కర పరిస్థితులు చూసిన ఈ యువకుడి మనసు చలించిపోయింది. ఎలా అయినా ప్రజలందరికి పర్యావరణంపై అవగాహన కల్పించాలని కంకణం కట్టుకున్నాడు. 2022 సంవత్సరం నుంచి నిర్విరామంగా కృషి చేస్తున్నాడు.
పట్టుదల, విజయం చేరాలన్న తపన ఉంటే అసాధ్యం అనుకున్న పనులైనా సుసాధ్యం చేయవచ్చు. సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన గుర్రం చైతన్య. చిన్నప్పటి నుంచి పర్యావరణంపై మక్కువ ఎక్కువ. ఎమ్.ఫార్మసీ చేసిన ఈ యువకుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మెడికల్ ఇంఛార్జిగా చేరాడు. కొంతకాలం పనిచేయగా వచ్చిన డబ్బుతో పర్యావరణాన్ని రక్షించడానికి కృషి చేస్తున్నాడు.
ఆరోగ్య భారతదేశంమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న ఈ యువకుడు వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. 2022 మే 16న నెల్లూరు నుంచి కన్యాకుమారి వరకు 1,500 కిలోమీటర్లు చెట్లు నాటే కార్యక్రమం గురించి అవగాహన కల్పస్తూ కేవలం 15 రోజుల్లో తన మొదటి దశ సైకిల్ యాత్ర పూర్తి చేశాడు. తదుపరి రెండవ దశ సైకిల్ యాత్రను గుజరాత్ రాష్ట్రంలోని పాకిస్థాన్ సరిహద్దు నడావేట్ వరకు ఆహరాన్ని వృధా చేయవద్దంటూ మూడు వేల 830 కిలోమీటర్లను 55 రోజులలో యాత్ర పూర్తి చేశాడు.
Bezawada Brothers Success Story: ఇష్టపడిన రంగంలో కష్టపడుతూ ఉన్నతశిఖరాన..! 'బెజవాడ బ్రదర్స్' చాలా ఫేమస్ గురూ..!
కాలుష్యం లేని వాతావరణం కోసం ప్రతి వ్యక్తి బాధ్యతగా మొక్కలను పెంచాలంటున్నాడు చైతన్య. అనుకున్న లక్ష్యం సాధించేందుకు 54వేల కిలోమీటర్ల సుదీర్ఘయాత్ర లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళతో సహ పలు రాష్ట్రాలలో తిరిగి ఇప్పటి వరకు 28వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రను పూర్తి చేసి యూత్ ఐకాన్ అవార్డు అందుకున్నాడు.
తాను దాచుకున్న డబ్బుతో పాటుగా స్నేహితుడి సహాయంతో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు చైతన్య. సంపాదన కన్నా సమాజానికి ఎంతో కొంత తన ద్వారా ప్రచారం చేసి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. భవిష్యత్తులో విదేశాల్లో సైతం ప్రకృతిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్తున్నాడు. ప్రజలకు సేవ చేసి ఏ రోజుకు అయినా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించేలా తన ప్రణాళికను రూపొందించుకుంటున్నాడు.
య్యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా ప్రజలతో మమేకం అవుతున్నాడు చైతన్య. చిన్నతనంలోనే అతి పెద్ద సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ పలువురి చేత ప్రశంసలు అందుకుంటున్న తమ కూమారుడిని చూస్తుంటే తమకెంతో గర్వంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు. ప్రభుత్వం సహయం అందిస్తే ఇంకా మెరుగైన అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్తున్నారు.
టూరిజం అంటే ఇష్టపడే చైతన్య తనకు నచ్చిన పనితోనే సమాజానికి చైతన్యం కల్పిస్తున్నాడు. తన ప్రయాణంలో ఎన్నో ఆటు పోట్లు ఎదురైనప్పటికీ అనుకున్న లక్ష్యం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో అతి సుందరమైనది ప్రకృతి. దేవుడు ప్రసాధించిన ఈ అద్భుతమైన వనరు మానవ కార్యకలాపాల వల్ల విధ్వంసానికి గురవుతోంది. దీంతో జరుగుతున్న దృష్పరిణామాలను దేశ నలుమూలల చాటి చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడు.
జీఎంఆర్ ఐటీ వేదికగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు