Neck Injury Due to Manja In Hyderabad : సంక్రాంతి అనగానే గాలి పటాలు ఎగురవేయడం, మాంజా, చరాక్ ఇవే గుర్తుకొస్తాయి. 'అరే.. ఈసారి ఫుల్ పతంగులు ఎగిరేద్దాం' అనుకుంటూ ప్లాన్స్ వేసుకుంటుంటారు చాలామంది. ఈ పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం ఎంత ఆనందాన్నిస్తుందో, దానికి ఉపయోగించే మాంజా అన్ని చేదు అనుభవాలను మిగులుస్తుంది. గాలిపటాలు ఎగురవేశాక ఆ మాంజాలు రోడ్లపై ఉంటాయి. వాటి వల్ల వాహనాలు నడిపే వారికి అవి కనిపించక, అవి మెడకు చుట్టుకుని మరణించిన ఉదంతాలు చూస్తూనే ఉంటాం. మరి కొందరు అలా తాకి తీవ్ర గాయాలపాలైన ఘటనలూ చూశాం. అలాంటి ఘటనే హైదరాబాద్ నాంపల్లిలో సోమవారం చోటుచేసుకుంది.
ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారికి హెచ్చరిక! - రాబోయే 20 రోజులు జాగ్రత్త!! - NECK INJURY DUE TO CHINESE MANJA
మెడకు మాంజా తగిలి తీవ్ర గాయం - మరొకరి చేతికి గాయం - ఆసుపత్రికి తరలించిన స్థానికులు
Published : Dec 24, 2024, 1:43 PM IST
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ హూమాయున్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం మహమ్మద్ రియాన్, మహమ్మద్ ఆదిల్ ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై ఆసిఫ్‌నగర్ నుంచి నాంపల్లి వైపు వెళ్తున్నారు. దేవునికుంట హిందూ స్మశాన వాటిక వద్ద అనుకోకుండా చైనా మాంజా గొంతుకు తగిలి తీవ్ర గాయమైంది. వెనకాల కూర్చున్న మహమ్మద్ ఆదిల్ చేతికి గాయమైంది. వెంటనే స్థానికులు గాయపడ్డ వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందించగా, ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డారు. ఈ క్రమంలోనే సంక్రాంతిని పురస్కరించుకుని ద్విచక్ర వాహనదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మాంజాతో ప్రాణాలు పోయే అవకాశం ఉండటంతో, గాలిపటాలు ఎగురవేసే వారూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పండుగ పేరిట ఇతరుల ప్రాణాలకు ముప్పు తేవొద్దని హెచ్చరించారు.