NDA Government Decision for New Roads and Repairs in Nellore District : శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రాజులపాడు గ్రామంలో సుమారు 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామంలో 300కు పైగా జనాభా నివాసిస్తున్నారు. ఈ గ్రామానికి ఏళ్లుగా సక్రమమైన రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో ఆ గ్రామ పరిస్థితి మారనుంది.
ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామీణ రహదారులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అడుగుకో గుంత, గజానికో గొయ్యితో అధ్వానంగా మారిపోయాయి. ఇక పల్లె ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ఐదేళ్ల పాలనలో కనీసం ఒకసారి కూడా మరమ్మతులకూ ఆసక్తి చూపించలేదు. గడిచిన అయిదేళ్లలో అధికారులు ప్రతిపాదనలు పెట్టడం, జగన్ ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారుల పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం బిగించింది. క్షేత్రస్థాయి నుంచి పనులను పరిశీలిస్తుంది. అత్యవసర పనులను గుర్తించి వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించింది. సరైన రోడ్డు సదుపాయం లేని గ్రామాలను గుర్తించడంతో పాటు గిరిజన గ్రామాలకూ ప్రత్యేకంగా నిధులు కేటాయించడానికి సన్నాహాలు చేస్తుంది.
విజన్ డాక్యుమెంట్‌లో భాగంగా : స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్‌లో భాగంగా సరైన రోడ్లు లేని గ్రామాలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. వెంటనే నిర్మాణాలు చేపట్టాలని సూచనలు చేసింది. దీనిపై నెల్లూరు జిల్లాలోని 37 మండలాల్లో సర్వే చేపట్టారు. గతంలో 500 కంటే అధిక జనాభా ఉన్న గ్రామాలను గుర్తించి రోడ్లు నిర్మించారు. తాజాగా 4 కేటగిరీలుగా పరిశీలిస్తున్నారు. 100 కంటే ఎక్కువ, 101 నుంచి 249 వరకు, 250 నుంచి 499, 500 కంటే ఎక్కువ జనాభా ప్రాతిపదికన అధికారులు సర్వే చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 60% పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రతిపాదనలు పంపుతారని అధికారులు వెల్లడించారు. ఆపై వీలైనంత త్వరగా బీటీ, సిమెంట్ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలియజేశారు. దీంతో పాటు ఎన్నో ఏళ్లుగా అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ ద్వారా 25 రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు.