NDA Candidates Election Campaign in AP : ఊరూరా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ కూటమి అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూటమి అభ్యర్థులకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోంది. అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు.
ఓట్ల వేటలో దూకుడు పెంచిన కూటమి అభ్యర్థులు - జోరుగా ఇంటింటి ప్రచారాలు
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతల, లింగగూడెం గ్రామాల్లో కూటమి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి 50వ డివిజన్‌లో ప్రచారం చేసి తనను ఆశీర్వదించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఓ టిఫిన్ బండి వద్దకు వెళ్లి గరిటె చేతబట్టి దోశ వేశారు.
బాబు వస్తే పొలాల్లో వరి, జగన్ వస్తే ప్రజలకు ఉరి : పల్నాడు జిల్లా పెదకూరపాడు కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ క్రోసూరులో ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. చిరువ్యాపారులు, దుకాణదారుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. స్వయంగా కాసేపు కూలీ అవతారమెత్తారు. బాబు వస్తే పొలాల్లో వరి, జగన్ వస్తే ప్రజలకు ఉరి అంటూ పల్నాడు జిల్లా వినుకొండ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా టిఫిన్ దుకాణాదారుల వద్దకు వెళ్లి టీ, టిఫిన్లు రుచి చూసి బాగున్నాయని కితాబిచ్చారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పూలవానలు కురిపిస్తూ కూటమి అభ్యర్థులకు ఘన స్వాగతం : అనంతపురం జిల్లా రాయదుర్గం కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు బ్రహ్మసముద్రం మండలం ఎనకల్లు, రాయలప్పదొడ్డి గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. కడపలో కూటమి అభ్యర్థి మాధవి ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. 80 ఏళ్ల వయస్సులోనూ ప్రొద్దుటూరు కూటమి అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి కార్యకర్తలతో కలసి ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం బైరాపురంలో కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి టపాసులు కాలుస్తూ పూలవాన కురిపిస్తూ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సింధూరరెడ్డి వినూత్నంగా ఎడ్లబండిపై కుటుంబసభ్యులతో కలసి ప్రచారం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కూటమి అభ్యర్థి ఆరవ శ్రీధర్ ప్రచారానికి గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
వైసీపీ పాలనపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి :అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజవర్గంలోని కపిలేశ్వరపురం మండలం అంగరలో కూటమి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావుకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం రమేష్, వంగలపూడి అనిత ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మధురవాడ ప్రాంతంలో గంటా ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. గంటాకు మద్దతుగా కొమ్మాదిలో స్థానికులు కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ పాలనపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఎన్నికల వరకూ కార్యకర్తలు మరింత కసితో పనిచేయాలని కూటమి తరఫున శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష పిలుపునిచ్చారు. మామిడిపల్లి, బొడ్డపాడు తదితర గ్రామాల్లో వీరిద్దరూ ప్రచారం చేశారు.
'ఎన్నికల్లో జగన్ సర్కారును తరిమికొట్టాలి'- గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచారం
వైసీపీని వెంటాడుతున్న వలసల భయం - బడా నేతలు సైతం పార్టీకి 'బైబై' - YCP LEADERS JOINING TDP
ఊరువాడల్లో ఊపందుకున్న ప్రచార జోరు - పూలవానలు కురిపిస్తూ కూటమి అభ్యర్థులకు ఘన స్వాగతాలు