NDA Alliance Election Campaign in Andhra Pradesh : మండుటెండలను లెక్కపెట్టక రాష్ట్రంలో అభ్యర్థులు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఓట్ల అభ్యర్థనకు వెళ్లిన నేతలకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్-6 పథకాలను వివరిస్తున్నారు. కూటమి మేనిఫెస్టోకు ఆకర్షితులైన వైఎస్సార్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. 17వ వార్డు కౌన్సిలర్ సరితా, ఆమె భర్త మాజీ కౌన్సిలర్ జయలింగారెడ్డిలు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. వారందరికీ టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు పాలనలో మేలు జరుగుతుందన్న నమ్మకంతోనే టీడీపీలో చేరారని తెలిపారు.
అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 4, 5వ డివిజన్లల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ కూటమి మేనిఫెస్టో అంశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పింఛన్ దారులను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ , మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటింటికి తిరిగి సూపర్-6పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.