Doctor Narasimha Sharma:ఆయన వృత్తి వైద్యం. ప్రవృత్తి రచనలు. విదేశాల్లో వైద్యునిగా సేవలందిస్తూ అందులోనూ పోయిట్రీ థెరపీ ద్వారా రోగులకు స్వాంతన కలిగించి ఖ్యాతి గడించారు. అంతేకాదు మాతృభాష ప్రేమికుడిగా ఇతర భాషల్లోని పద్యాలను తెలుగులోకి, తెలుగు పద్యాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి ఎన్నో రచనలు చేసి వహ్వా అనిపిస్తున్నారు. మరో ఆశ్చర్యకరమైన అంశమేంటంటే.. ఇవన్నీ చేస్తున్నది వందేళ్ల వృద్ధుడు. తన నూరవ ఏట కూడా ఓ పద్యాన్ని రాసి శభాష్ అనిపించుకున్నారు.
ప్రస్తుతమున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి నేపథ్యంలో వందేళ్ల పాటు జీవించడం చాలా కష్టం. అందులోనూ ఆరోగ్యంగా ఉండటం మరింత అరుదు. కానీ నరసింహశర్మకు ఇది సాధ్యమైంది. ఈయన ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి అలియాస్ రావిశాస్త్రికి స్వయానా సోదరుడు.
శ్రీకాకుళంలో 1924లో జన్మించిన నరసింహ శర్మ హౌస్ సర్జెన్ పూర్తి చేసి ఆంధ్ర వైద్య కళాశాలలో M.D. చేశారు. పరిశోధనల కోసం అమెరికా వెళ్లిన తర్వాత తన గైడ్ అర్ధాంతరంగా కాలం చేయడంతో సైక్రియాట్రీ విభాగం వైపు పరిశోధనలు మళ్లించుకున్నారు. అక్కడే డిగ్రీ పూర్తి చేసి సైక్రియాటీలో అత్యున్నత పదవులు నిర్వహించారు. పొయిట్రీ థెరపీ ద్వారా రోగులకు స్వాంతన కలిగించడం నరసింహశర్మ ప్రత్యేకత.
2004లో 80ఏళ్ల వయసులో నరసింహశర్మ విశాఖకు వచ్చేసి ఇక్కడే స్థిరపడ్డారు. వైద్యం కొనసాగిస్తూనే పద్యరచన, పుస్తక రచనకు ప్రాధాన్యమిచ్చారు. అప్పటికప్పుడు కవిత్వం చెప్పడంతో పాటు దాన్ని కాగితంపై పెట్టి అక్షరరూపం ఇవ్వడంలో శర్మ ఆరితేరారు. 140 కి పైగా పద్యాలు రాసి ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. వయసు మీద పడడంతో వైద్య వృత్తికి స్వస్తి చెప్పినప్పటికీ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. నూనె, నెయ్యి పదార్థాలకు దూరంగా ఉండటం, మంచి ఆహారపు అలవాట్లతోనే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నారు.