Nara Lokesh Comments on CM Jagan: చొక్కా చేతులు మడతపెడతామంటూ సీఎం జగన్ గూండాగిరీ చేయాలనుకుంటున్నారా అంటూ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు చొక్కాలు మడత పెడితే, పసుపు సైనికులు కుర్చీలు మడత పెడతారని హెచ్చరించారు. ఇన్నాళ్లూ మూడు ముక్కలాట ఆడిన వైఎస్సార్సీపీ నేతలు, ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించమంటూ కొత్త నాటకానికి తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారందరిపైనా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.
వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమా: ఉత్తరాంధ్రలో శంఖారావం యాత్ర నిర్వహిస్తున్న నారా లోకేశ్ నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పాలనపై రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ఏ ఇంటికెళ్లి అడిగినా ఇదే మాట చెబుతారని, ఈ అంశంపై ఇంటింటికీ వెళ్లేందుకు వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
'ఆ కుర్చీనట్టా మడత పెట్టి' - సీఎం జగన్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్
మహిళల తాళిబొట్లు తెంపుతున్నారు: మద్యం దుకాణాల వద్దకైనా వచ్చేందుకు సిద్ధమని, జగన్‌కు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కల్తీ మద్యం (Contaminated Wine) తయారుచేసి మహిళల తాళిబొట్లు తెంపుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని గాలికొదిలేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడుతున్న జగన్ ప్రభుత్వంపై కుర్చీలు మడత పెట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని లోకేశ్ హెచ్చరించారు.
ప్రతి పథకం వెనక ఓ కుట్ర: తనను అరెస్ట్ చేయించేందుకు తహతహలాడుతున్న వైఎస్సార్సీపీ నేతలు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఒక్క కేసైనా చూపించగలరా అని లోకేశ్ సవాల్ విసిరారు. విజయనగరం బహిరంగ సభలో పాల్గొన్న లోకేశ్ నిజాయతీగా నడుస్తున్న మాన్సాస్ ట్రస్టును దోచుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలు పన్నాగం పన్నారని ధ్వజమెత్తారు. జగన్ ఏ పథకం (YSRCP Schemes) తీసుకువచ్చినా దాని వెనుక కుట్ర ఉంటుందని అన్నారు.