TCS will be set up in Visakhapatnam:అందాల సాగర తీరానికి త్వరలోనే మరో మణిహారం రానుంది. మంత్రి నారా లోకేశ్ చొరవతో విశాఖలో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ (Tata Consultancy Services) ఏర్పాటు కానుంది. టీసీఎస్ రాకతో యువతకు 10 వేల ఐటీ ఉద్యోగాలు లభించనున్నాయి. మంగళవారం ముంబయిలో టాటా గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈవీ, ఎయిరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులు పరిశీలిస్తామని టాటా గ్రూప్ తెలిపింది. అదేవిధంగా స్టీల్, టూరిజం రంగాల్లో పెట్టుబడులు పరిశీలిస్తామని సంస్థ ఛైర్మన్ తెలిపారు. టాటా గ్రూప్ ఛైర్మన్‌ను ఒప్పించి విశాఖకు టీసీఎస్ వచ్చేలా మంత్రి లోకేశ్ చేసిన కృషి సఫలమైంది.
లులు, ఒబెరాయ్, బ్రూక్ ఫీల్డ్, సుజలాన్ తర్వాత ఏపీకి టీసీఎస్ రానుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కంపెనీలను ఆహ్వానిస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచేందుకు ఇది తొలి అడుగని లోకేశ్ సామాజిక మాద్యమం ఎక్స్(X)లో పోస్ట్ చేశారు. టీసీఎస్ రాకతో విశాఖ ఐటీ హబ్‌గా మారనుందని ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ మారుతుందని హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ పెట్టుబడి వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
వైజాగ్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ 10 వేల మంది ఉద్యోగులతో కూడిన ఐటీ అభివృద్ధి చేయడాన్ని మంత్రి లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. వ్యాపారం చేయడంలో వేగం అనే తమ నినాదంతో నడిచే కార్పొరేట్‌లకు అత్యుత్తమ పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. రాష్ట్రాన్ని వ్యాపార రంగంలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేయడానికి తాము చేస్తున్న కృషికి టీసీఎస్ ద్వారా ఈ పెట్టుబడి ఒక మైలురాయని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.