Nalgonda Boy Selling Fruits Box For Diet People :ఇటీవల కాలంలో ఆరోగ్యంపై ప్రతిఒక్కరికి అవగాహన పెరిగింది. ప్రజలు ఆరోగ్యాలను కాపాడుకునేందుకు రకరకాల ప్రయోగాలు, కసరత్తులు చేస్తున్నారు. దీనికి తోడు సామాజిక మాధ్యమాల పరిధి విస్తృతం కావడంతో అనేక మంది వైద్యులు, యోగా శిక్షకులు, న్యూట్రిషన్ల సలహాలు నిత్యం వందల కొద్దీ మన సెల్ఫోన్లలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో అనేక మంది వారికి నమ్మకం కలిగిన సలహాలను స్వీకరిస్తూ పాటిస్తున్నారు. చిరు ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరల రసాలు, రాగి, జొన్న జావలు, గానుగ నూనెలు వంటిని ఇందులోకే వస్తాయి. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇది నగరానికే పరిమితమైనా, ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో విక్రయానికి పెడుతున్నారు.
గతంలో మనకు అవసరం ఉన్న పండ్లు కొనుక్కొని తినేవారు. అయితే ధర ఎక్కువగా ఉంటే పేద, మధ్య తరగతి కొనేందుకు ఆలోచించేవారు. అయినా ఇక తప్పదు అనుకుని ఒకసారికి ఒకటి, రెండు రకాల పండ్లు మాత్రమే కొనుగోలు చేస్తారు. అయితే ఇటీవల కాలంలో నగరాల్లో పలు రకాల పళ్ల ముక్కలు ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నారు. నాలుగైదు రకాల పండ్ల ముక్కలతో పాటు డ్రైఫ్రూట్స్, మొలకలు సైతం అందిస్తుండడంతో వీటికి ఆదరణ పెరుగుతోంది.