Naga Shilasashanam Dilapidated In Guntur District :చరిత్రకు సజీవ సాక్ష్యాలు శాసనాలు. నాటి కాలమాన పరిస్థితులు, జీవన విధానాలు, రాచరిక వైభవాలను శాసనాలు చాటిచెబుతాయి. వేల సంవత్సరాల ఈ చారిత్రక సంపద కాపాడుకోవాల్సి ఉన్నా అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజల నిర్లక్ష్యం కారణంగా కనుమరుగయ్యే స్థితికి చేరాయి. ఆంధ్రుల వైభవాన్ని చాటిచెప్పేలా అమరావతి ప్రాంతంలో ఉన్న నాగశాసనం శిథిలావస్థకు చేరింది.
ఆంధ్రుల వైభవానికి కృష్ణాతీరం కీర్తిపతాక. అమరావతి రాజధానిగా రాజరాజులు ఏలిన చరిత్ర ఈ ప్రాంతం సొంతం. కాకతీయుల పాలనా గుర్తులు ఈ ప్రాంతంలో అడుగడునా కనిపిస్తాయి. అందుకు సజీవ సాక్ష్యమే ప్రస్తుత రాజధాని ప్రాంతంలోని మల్కాపురంలో ఉన్న నాగశిలాశాసనం. చరిత్రకారులు, పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో రాణీ రుద్రమదేవి జన్మదిన వేడుకలు మందడంలో జరిగాయని తేలింది.
ఆ సందర్భంలోనే మందడం గ్రామ శివారులోని మల్కాపురంలో 14 అడుగుల ఎత్తు, మూడు అడుగుల మందంతో నల్లరాతి నాగశిలాశాసనం ప్రతిష్ఠించారు. క్రీస్తుశకం 1261లో కాకతీయ గణపతిదేవుడు, అతని కుమార్తె రుద్రమదేవి కలిసి వేయించినట్లు శానసంపై రాసి ఉంది. రుద్రమదేవి ఏ సంవత్సరంలో జన్మించారనేది కచ్చితంగా తెలియకపోయినా ఆమె పుట్టిన తేదీ మాత్రం మార్చి 25 శుక్రవారంగా ఈ శాసనంలో ఉంది.
'మొత్తం 200 ఫంక్తుల్లో ఉన్న ఈ శాసనంలో యూపీలోని గోళకి మఠం సంప్రదాయాన్ని మందడంలో ప్రవేశపెట్టడమే గాకుండా ఇక్కడ మఠం, ఆలయం, వైద్యశాల, ప్రసూతి ఆసుపత్రి వంటివి నిర్మించినట్లు ఈ శాసనంపై లిఖించారు. సంస్కృతం, తెలుగు భాష అక్షరాలు ఈ శాసనంపై కనిపిస్తాయి. నవనగరాల్లో భాగంగా అమరావతి రాజధాని ప్రాంతంలో “హెల్త్ సిటీ“నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటోంది. కానీ ఈ ప్రాంతంలో రాణిరుద్రమదేవి కాలంలోనే ఆరోగ్య నగరం ఉందని ఈ శాసనాల ద్వారా తెలుస్తోందని చరిత్రకారులు చెబుతున్నారు.'-పాపినేని సాయి, చరిత్రకారుడు
ఎర్రమలగుహల్లో ఆదిమానవుడి పెయింటింగ్స్ - దాచేస్తున్న మైనింగ్ మాఫియా
దాదాపు 8 శాతాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఠీవిగా నిలిచిన ఈ శాసనం ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది. ఈ శాసనం చుట్టూ కాలనీ ఏర్పడటంతో ఇళ్లమధ్యలో ఉన్న ఈ శాసనం బయటకు కనిపించడం లేదు. పరిసర ప్రాంతం పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాలతో కళావిహీనంగా ఉంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు పట్టాలివ్వడంతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. వీరిని ఖాళీ చేయించడం సాధ్యమయ్యే పనికాదని తెలుస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ చారిత్రక సంపదను కాపాడుకోవాల్సి ఉందనే వాదన వినిపిస్తోంది. ఎంతో గొప్పదైన ఈ శాసన పరిరక్షణకు, పర్యాటకరంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చరిత్రకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ముమ్మరంగా జంగిల్ క్లియరెన్స్ పనులు- రాజధాని రైతుల సంతోషం - farmers About Jungle Clearance