Mumbai Actress Complaint to Vijayawada Police:వైసీపీ నేత, పోలీసు అధికారుల నుంచి వేధింపుల వ్యవహారంలో ముంబయి సినీ నటి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులతో కలిసి విజయవాడ సీపీ కార్యాలయానికి వచ్చిన నటి తనపై జరిగిన వేధింపుల వివరాలను పోలీసులకు వివరించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.
పెళ్లి వద్దన్నందుకే నాపై కక్ష: ఈ కేసులో నిజాలు బయటకు రావాలని ముంబయి నటి అన్నారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. వైఎస్సార్సీపీ నేతలు, పోలీసుల వల్ల తాను, తన కుటుంబసభ్యులు చాలా ఇబ్బంది పడ్డామని తెలిపారు. అంతే కాకుండా వాళ్లు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. తనను అనేక రకాలుగా వేధించారని అన్నారు. తన దగ్గరున్న సాక్ష్యాలు, ఆధారాలు పోలీసులకు ఇచ్చినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్ తన దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చాడని కానీ తాను వ్యతిరేకించినట్లు వివరించారు. విద్యాసాగర్‌ను వద్దన్నాననే అసూయతో తనపై కక్ష కట్టాడని వాపోయారు. విద్యాసాగర్‌పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని ముంబయి నటి అన్నారు.
పోలీసులు వాంగ్మూలం రికార్డు చేశారని మీడియాకు ముంబయి నటి న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. నటిని వేధించిన ముగ్గురు ఐపీఎస్‌లు ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీపై ఫిర్యాదు చేశామన్నారు. ముంబయి నటిపై ఎక్కడా కేసులు లేవని, 41ఏ నోటీసులిచ్చి కేసులో కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. వృద్ధులైన నటి తల్లిదండ్రులను జైలులో పెట్టి బెయిల్ రాకుండా చేశారని తెలిపారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణలో తేలుతుందన్నారు. ఫిర్యాదు చేసిన విద్యాసాగర్ చూపించే అగ్రిమెంటూ కేసు పెట్టేందుకు చేసిందేనని నర్రా శ్రీనివాస్ స్పష్టం చేశారు.