ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులకు బిగుస్తున్న ఉచ్చు - ముంబయి నటి వాంగ్మూలంలో కీలక విషయాలు - MUMBAI ACTRESS CASE - MUMBAI ACTRESS CASE

MUMBAI ACTRESS CASE: ముంబయి నటి కేసులో నకిలీ పత్రాలు సృష్టించిన పోలీసులకు ఉచ్చు బిగుస్తుంది. రెండో రోజూ హీరోయిన్, ఆమె కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు స్టేట్ మెంట్​ను రికార్డ్ చేసుకున్నారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనపై కేసు నమోదు చేయటం వెనుక కుట్ర ఉందని నటి పోలీసులకు తెలిపారు.

MUMBAI ACTRESS CASE
MUMBAI ACTRESS CASE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2024, 7:19 AM IST

MUMBAI ACTRESS CASE: ఏ ఫోర్జరీ కేసు పెట్టి బాలీవుడ్‌ నటిని కటకటాలపాలు చేశారో, ఇప్పుడు అదే కేసు పోలీసుల మెడకు చుట్టుకోబోతుంది. ముంబయి నటిపై అక్రమ కేసు పెట్టి, వేధింపులకు గురి చేసిన వ్యవహారంలో డొంక కదులుతోంది. రెండు రోజుల విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. హీరోయిన్, ఆమె కుటుంబ సభ్యుల అరెస్టుకు విద్యాసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదే ఆధారమని తెలుస్తోంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, 5 ఎకరాల పొలంపై హక్కులు పొందినట్లు తప్పుడు పత్రం సృష్టించినట్లు వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదు చేశారు. అసలు ఈ ఫోర్జరీ పత్రం గురించి సరిగా దర్యాప్తు చేయకుండానే కేసు నమోదు చేసినట్లు నటి ఆరోపించారు.

దీనికితోడు ఆ భూమిని కొన్నారని చెబుతున్న ఇద్దరు కీలక సాక్షులు పోలీసులకు అప్పట్లో ఇచ్చిన స్టేట్‌మెంట్లకు ఎదురుతిరిగారు. ఈ పరిణామం పలువురు పోలీసు అధికారుల మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని, తన ఆధార్‌కార్డు తీసుకుని విద్యాసాగర్‌ తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు చిందా వీరవెంకట నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు బోరుకాటి భరత్‌కుమార్‌లు చెబుతున్నారు. వీరిద్దరినీ కమిషనర్‌ కార్యాలయానికి పిలిపించి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు. వీరిని రెండో రోజూ పిలిచి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా విచారించారు.

కేసు నమోదు చేసిన సమయంలో ఇబ్రహీంపట్నం సీఐ ఎదుట నాగేశ్వరరాజు, భరత్‌కుమార్‌లు ఇచ్చిన స్టేట్‌మెంట్లను చూపించి, ఎవరి ఒత్తిడితో అలా చెప్పారని దర్యాప్తు అధికారి ప్రశ్నించారు. కుక్కల విద్యాసాగర్‌ చెప్పిన మీదటే తాము వ్యవహరించినట్లు వివరించినట్లు తెలుస్తోంది. సాక్షులను నటితో పాటు ఎదురెదురుగా కూర్చోబెట్టి, వారికి ప్రశ్నలను అడిగి సమాధానాలను రాబట్టినట్లు సమాచారం. ఇవాళ మిగిలిన సాక్షులను పిలిచి వారిని కూడా క్షుణ్ణంగా ప్రశ్నించనున్నారు.

విద్యాసాగర్ హనీట్రాప్ ఆరోపణలు అవాస్తవం - ఈ వ్యవహారం వెనక కుట్ర ఉంది: ముంబయి నటి - Actress Jathwani Family met CP

ముంబయి నటి, ఆమె తల్లిదండ్రులు, మరికొందరిని విచారణ అధికారి స్రవంతి రాయ్‌ నగర పోలీసు కమిషనరేట్‌కు పిలిపించి వివరాలు రాబట్టారు. ప్రధానంగా దర్యాప్తులో పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు సమాచారం. కీలక పోలీసు అధికారి ప్రమేయం గురించి కూడా నటి కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు తెలిసింది. అప్పట్లో నగర కమిషనరేట్‌లో పనిచేసిన పలువురు అధికారుల్ని పిలిపించి వివరాలు సేకరించారు. కేసు నమోదు, అరెస్టు, కస్టడీ సమయంలో వారు నిర్వర్తించిన పాత్ర గుర్తించి విచారించారు.

ఇప్పటికే పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు కేసు దర్యాప్తు అధికారి, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నటి తండ్రి దర్యాప్తు అధికారి ముందు తన ఆవేదన వెళ్లబోసుకున్నారు. 72 ఏళ్ల వయస్సులో, పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, కనీస మానవత్వం లేకుండా విజయవాడ పోలీసులు వ్యవహరించారని చెప్పినట్లు సమాచారం. ముంబయిలో పారిశ్రామికవేత్తపై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిళ్లు తెచ్చారని వాపోయారు.

'మేము ఆ భూమి కొనలేదు - కుక్కల విద్యాసాగర్ ఇరికించారు' - ముంబయి సినీ నటి కేసులో కీలక మలుపు - Bollywood Actress Case Update

5 రోజుల పోలీసు కస్టడీలో కొందరు అధికారులు అతిగా ప్రవర్తించారని, మఫ్టీలో వచ్చి వేధించినట్లు తెలిపారు. విచారణలో పలువురు పోలీసు అధికారుల పాత్ర గురించి ఫిర్యాదు అందజేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలా? లేదా ఏవిధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిసింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పారని నగర కమిషనరేట్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులు సంబంధం లేకపోయినా జోక్యం చేసుకున్నట్లు వెల్లడైంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 మంది వరకు ఈ కేసులో కీలకపాత్ర పోషించారు. దర్యాప్తు బాధ్యతలు వారికి అప్పగించకపోయినా కూడా పోలీసు కస్టడీలో ఉన్న నటి కుటుంబసభ్యులను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వెళ్లి పర్యవేక్షించినట్లు సమాచారం.

అప్పట్లో పశ్చిమ ఏసీపీగా హనుమంతరావు ఉన్నారు. అరెస్టు అనంతరం ఆయన కాకినాడకు బదిలీ అయ్యారు. అయినా ప్రత్యేకంగా వచ్చి కస్టడీకి తీసుకున్న సమయంలో క్రియాశీలకపాత్ర పోషించారు. బదిలీ అయిన అధికారిని ప్రత్యేకంగా ఎందుకు పిలిపించారు అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఏలూరు రేంజిలో వీఆర్‌లో ఉన్న ఓ అధికారి కూడా నటిపై ఒత్తిడి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. దీని వెనుక కీలక పోలీసు అధికారి ఉన్నారని, ఆయన ఆదేశాలతోనే నడిచినట్లు తెలుస్తోంది.

ఆ ముగ్గురూ కీలకంగా వ్యవహరించారు - ఇంటివద్ద రెక్కీ చేశారు: ముంబయి నటి - MUMBAI ACTRESS CASE

ABOUT THE AUTHOR

...view details