Mountaineer Rajitha In Kamareddy : అరకొర వసతులున్నా కృత నిశ్చయంతో లక్ష్యాలు సాధిస్తోంది ఈ యువతి. గిరిజన గ్రామంలో పుట్టినా మౌంటెనీర్‌గా రాణించాలని తపన పడింది. అనుకున్నట్టే ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతం అధిరోహించింది. కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో ఇంటికి దూరంగా ఉంటూ పోటీ పరీక్షలకూ సన్నద్ధమైంది. కష్టాలు దాటి ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగమూ సాధించి శభాశ్ అనిపించుకుంటోంది. ఈ యువతి పేరు మాలోత్ రజిత. ఈమెది కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఎక్కపల్లి తండా. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టినా చదువుల్లో ఎక్కడా తడబడలేదు. ఎల్లారెడ్డి కేజీబీజీవీలో 9వ తరగతి చదివే సమయంలో ఉపాధ్యాయులు ఓ కార్యక్రమానికి తీసుకు వెళ్లారు.
Maloth Rajitha Climbed Mount Kilimanjaro : అక్కడకు ఎవరెస్ట్ అధిరోహించిన మలావత్ పూర్ణ అతిథిగా హాజరై ప్రసంగించింది. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయం రజితలో స్ఫూర్తి నింపాయి. తాను కూడా ఎప్పటికైనా పూర్ణలా పర్వతారోహణ చేయాలని అప్పుడే నిశ్చయించుకుంది. హైస్కూల్ పూర్తి అయినా లక్ష్యం చేరుకునే మార్గం కనిపించలేదు రజితకు. మెదక్‌లోని గీతా జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తయినా ఎలాంటి దారి దొరకలేదు. మెదక్‌లోనే సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో చేరింది. అక్కడ చేరిన మొదటి ఏడాదిలోనే కళాశాల తరపున పర్వతారోహకురాలిగా వెళ్లేందుకు అవకాశం వచ్చింది. కానీ భయంతో వెనుకంజ వేసింది రజిత. 2వ ఏడాదిలో మళ్లీ అవకాశం తలుపు తట్టడంతో ఇక ఆగలేదు.
"తాను చిన్నప్పటి నుంచి ఎక్కాపల్లి తాండలోనే చదువుకున్నాను. 6వ తరగతి నుంచి కేజీబీజీవీలో చదువుకున్నాను. 9 వ తరగతి చదువుకునే సమయంలో సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ఎవరెస్ట్ అధిరోహిని మాలావత్ పూర్ణను అతిథిగా వచ్చారు. అప్పుడు తను పడిన కష్టాలను చెప్పినప్పుడు ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నాను. పర్వతారోహకురాలిగా అవకాశం కోసం ఎదురు చూసి, రాగానే దానిని వినియోగించుకుని, కిలిమంజారోను అధిరోహించాను. ఆ తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను." - మాలోత్ రజిత, పర్వతారోహకురాలు.