Motorists Died Without Helmet in 2024 Road Accident : పోలీసులు తనిఖీలు చేసి లక్షల కొద్దీ చలానాలు విధిస్తున్నా రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం వందల మంది ప్రాణాలు పోతున్నాయి. కానీ కొందరు వాహనదారులకు హెల్మెట్ ధరించడానికి మనసు రావడం లేదు. లైసెన్సులు రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా ఏ మాత్రం లెక్కచేయడం లేదు. గత సంవత్సరం 2024లో హైదరాబాద్లోని 3 కమిషనరేట్లలో మొత్తం 57.51 లక్షల మంది వాహనదారులపై కొరఢా ఝుళిపించారు.
లైసెన్సు రద్దు :ప్రస్తుతం హెల్మెట్ ధరించని వాహనదారులు తొలిసారి పట్టుబడిన సందర్భంలో పోలీసులు రూ.100, మరోసారి పట్టుబడినట్లు గుర్తిస్తే రూ.1500 చలానా విధిస్తున్నారు. అవసరం అయితే లైసెన్సు రద్దు చేయాలంటూ సిఫారసు చేస్తారు.
విచిత్ర సమాధానాలు : ఇటీవలి కాలంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించని వాహనదారులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించని వారి వాహనం ఆపినప్పుడు వాహనదారుల సమాధానాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. కొత్తగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నామని, హెల్మెట్ ధరిస్తే వేడికి కొత్త జుట్టు ఊడిపోతుందని ఓ వాహనదారుడు సమాధానం ఇచ్చాడు. రూ.వేలు ఖర్చు చేసి హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించున్నామని మరొకరు, మెడ నొప్పి, ఉక్క పోత అంటూ వింత బదులిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ లేక వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. చిన్న కారణాలతో వాహనదారులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.