Dharmavaram CI Mother Murdered: ధర్మవరం సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. 62 ఏళ్ల స్వర్ణకుమారి హత్య కు గురైనట్లు పోలీసులు గుర్తించారు. తన అనారోగ్య సమస్యలకు స్వామీజీలను నమ్ముకోవడమే ఆమె మృతికి కారణమైంది. నగల కోసం ఇంటిపక్కన ఉన్న వ్యక్తే సీఐ తల్లిని హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం, అతడిచ్చిన సమాచారం మేరకు స్మశానంలో పూడ్చిపెట్టిన స్వర్ణ కుమారి శవాన్ని వెలికి తీసి అక్కడే పంచనమా నిర్వహించారు.
వివరాల్లోకి వెళ్తే, అమ్మ చెరువు మిట్ట జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి (62) గత నెల 28వ తేదీన అదృశ్యమయ్యారు. దీంతో ఈ నెల 2వ తేదీన స్వర్ణకుమారి బంధువుల మదనపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్వర్ణకుమారి స్మశానంలో శవమై కనిపించారు.
ఇంటి పక్కన వ్యక్తే హత్య: స్వర్ణకుమారిని ఆమె ఇంటి సమీపంలోనే ఉంటున్న వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వెంకటేష్ హతురాలి ఇంటి సమీపంలోనే నివాసముంటు చాలా నమ్మకంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 28వ తేదీ ఆమెను ఆరోగ్య సమస్యలు పరిష్కారం కోసం స్వామీజీ వద్దకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఆ తర్వాత స్వర్ణకుమారి ఇంటికి రాలేదు. దీన్ని గమనించిన స్థానికులు కొంతమంది సమాచారాన్ని మృతురాలి బంధువులకు అందించారు. అనుమానితుడిగా ఉన్న వెంకటేష్ ఊరు వదిలి వెళ్లిపోయాడు. చివరకు పోలీసులు అతన్ని పట్టుకొని సమాచారం రాబట్టారు.