MLA Yeluri Sambasiva Rao Letter To Central Minister :బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం మోటుపల్లి-పెద్దగంజాం మధ్య సముద్రతీర ప్రాంతంలో ఓడల తయారీ పరిశ్రమ, గ్రీన్‌ఫీల్డు పోర్టు నిర్మించాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌కు లేఖ రాశారు. ఆ లేఖను గురువారం దిల్లీలో మారిటైంబోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య కేంద్ర మంత్రికి అందజేశారు. ఆ రెండు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం రాష్ట్రానికి, దేశానికి తలమానికంగా నిలుస్తుందని, దీంతో పాటు ప్రాచీన చరిత్రకు జీవం పోసి ఎంతో ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని ఎమ్మెల్యే తన లేఖలో పేర్కొన్నారు.
ఓడల తయారీ పరిశ్రమ ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం. అది ఏర్పాటైతే ఇక్కడ 10 వేలమందికి ఉపాధి లభిస్తుంది. స్థానికంగా చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, కూలీలకు ఉపాధి మెరుగవుతుందని దాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని స్థానికంగా నెలకొల్పాలని కోరారు. వీటి స్థాపనకు అసైన్డ్ భూములు పెద్దఎత్తున ఉన్నాయి. భూసేకరణకు డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. తయారైన ఓడలను తరలించటానికి, మరమ్మతులకు గురైనవి తీసుకొచ్చి పునరుద్దరించుకోవడానికి జల రవాణా దోహదం చేస్తుంది.
బాపట్ల జిల్లాలో ఓడల తయారీ క్లస్టర్! - పరిశీలించిన కేంద్ర బృందం
ఇన్ని అవకాశాలు ఉన్న ప్రాంతం రాష్ట్రంలో ఇదేనని, ఆ దృష్ట్యా వాటిని ఇక్కడ స్థాపించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రికి రాసిన లేఖలో ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ ఓడల తయారీ యూనిట్ స్థాపన చేస్తామని హామీనిచ్చాం. దాన్ని నెరవేర్చినట్లు అవుతుందన్నారు. దీని నిర్మాణానికి తనవంతు బాధ్యతగా మారిటైం బోర్డు ఛైర్మన్ సత్య పూర్తి సహకారం అందిస్తున్నారని ఏలూరి తెలిపారు.
లేఖలో ప్రస్తావించిన ముఖ్యాంశాలు
- మోటుపల్లి నుంచి పెద్దగంజాం సముద్రతీర ప్రాంతం ఓడల తయారీ పరిశ్రమ, గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి అనువైన ప్రాంతమిది. స్థానికంగా అనేక సహజ వనరులు ఉన్నాయి. అంతే కాకుండా చదువుకున్న యువత, కార్మికులు ఎక్కువగా ఉన్నారు.
- ఇక్కడ మానవ వనరుల కొరత అనేది ఉండదు. మెరుగైన రవాణా వ్యవస్థను కలిగి ఉంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఇది దగ్గరి ప్రాంతం.
- ఇక్కడ బ్రిటీష్ హయాంలోనే పోర్టు ఉంది. సుగంధ ద్రవ్యాల రవాణా సాగింది.
- రొంపేరు కాలువ ద్వారా నీరు సముద్రంలో కలుస్తుంది. సముద్ర రవాణాకు ఇక్కడ అనువైన వాతావరణం ఉంది. మండల కేంద్రానికి కేవలం 5 కి.మీ దూరం. జాతీయ రహదారి-16కు ఇది సమీప ప్రాంతం. దీనికి సమీపంలోనే 7 కి.మీ దూరంలో రైల్వే లైన్ ఉంది.
- ఏపీ రాజధాని అమరావతికి 120 కి.మీ దూరం. జల రవాణా మార్గం బకింగ్‌హామ్ కెనాల్‌కు ఇది కూత వేటు దూరంలో ఉంది.
- బాపట్ల, ప్రకాశం జిల్లా కేంద్రాలకు రెండింటికి అతి సమీప ప్రదేశం. బకింగ్‌హామ్‌కెనాల్ ద్వారా దేశీయ జలమార్గాల అభివృద్ధికి దోహదం చేస్తుంది.
- అంతర్జాతీయ రవాణా వ్యవస్థ ద్వారా దక్షిణాసియా, చైనా, మధ్య తూర్పు దేశాలకు సరకు రవాణాకు ఇది అనువుగా ఉంటుంది. దేశ, విదేశాలకు ఇక్కడి నుంచి రొయ్యల ఎగుమతి చేయొచ్చు.
నాగార్జునసాగర్-శ్రీశైలం బోటు షికారు ప్రారంభం - ప్యాకేజి వివరాలివే