MLA Kondababu Opened Kakinada Dumping Yard Route : కాకినాడను గంజాయి రహిత నగరంగా మార్చాలని అధికారులకు, పోలీసులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు సూచించారు. ఐదేళ్లుగా డంపింగ్ యార్డు నుంచి పోర్టుకు వెళ్లే మార్గాన్ని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ గంజాయి ముఠాకు కేంద్రంగా మార్చారని విమర్శించారు. ఇంతకాలం మూసేసిన రహదారిని ఎమ్మెల్యే కొండబాబు అధికారులతో కలిసి తిరిగి తెరిపించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తామన్నారు.
ఐదేళ్లుగా డంపింగ్ యార్డు మార్గాన్ని ద్వారంపూడి మూసేశారు :ఎమ్మెల్యే కొండబాబు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ హయాంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ గత ఐదేళ్లుగా కాకినాడలోని డంపింగ్ యార్డ్ దారిని మూసివేయించారని మండిపడ్డారు. గతంలో డంపింగ్ యార్డ్ నుంచి పోర్ట్కు వందల సంఖ్యలో వాహనాలు వెళ్లేవని గుర్తుచేశారు. అలాంటి ప్రధాన రహదారిని ద్వారంపుడి మూయించడం వల్ల ఐదేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అటువైపు వాహనాలు వెళ్లక పోవడంతో డంపింగ్ యార్డ్ మెుత్తం అసాంఘిక కార్యకలాపాలాలకు నిలయంగా మారిందని విమర్శించారు. దీనిపై అప్పట్లో అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. దీని కారణంగా ఈ ప్రాంతాం గంజాయి ముఠాలకు కేంద్రంగా మారిందని విమర్శించారు. ఆ ప్రాంతంపై తాను గతంలో చేసిన ఆరోపణలకు ఇప్పటికి కట్టుబడి ఉన్నానని కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు.