Minister Uttam Kumar Reddy on Sunkishala Project :సుంకిశాల ఘటన చిన్నదని, నష్టం కూడా తక్కువేనని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సుంకిశాలకు జరిగిన నష్టాన్ని గుత్తేదారే భరిస్తారని, ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తికి ఒకట్రెండు నెలలు ఆలస్యమవుతుందని మంత్రి తెలిపారు. జులై 2న నాగార్జునసాగర్‌లో భారీగా వరద నీరు పోటెత్తడంతో, ఒక్కసారిగా పంప్‌హౌస్ రెండో సొరంగ మార్గం నుంచి ప్రవాహం ఉద్ధృతంగా రావడంతో సుంకిశాల పంప్‌హౌస్‌లోని రక్షణ గోడ కూలింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సుంకిశాల ప్రాజెక్టును మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి మంత్రులు ఉత్తమ్, తుమ్మల పరిశీలించారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేస్తామని మంత్రి ఉత్తమ్ ఉద్ఘాటించారు. డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సుంకిశాల పనులు బీఆర్‌ఎస్ హయంలో జరిగాయని, ఘటనపై సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి తెలిసిందని తెలిపారు. సుంకిశాల ఘటన జరగ్గానే ప్రభుత్వం స్పందించిందని పేర్కొన్నారు.
'సుంకిశాలకు జరిగిన నష్టాన్ని గుత్తేదారు భరిస్తుంది. ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి నష్టం లేదు. సుంకిశాల పనులు బీఆర్‌ఎస్ హయంలో జరిగాయి. ప్రభుత్వానికి ఘటనపై సోషల్ మీడియా ద్వారానే తెలిసింది'- ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మంత్రి
సుంకిశాల ఘటనపై విచారణ :సుంకిశాల ఘటనపై వాటర్ వర్క్స్ సిబ్బంది విచారణ చేస్తున్నారని, సీఎంతో చర్చించి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై నిర్ణయిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సుంకిశాల ప్రాజెక్టుపై విమర్శలు మంచిది కాదని, గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం జరిగినంత వేగంగా కృష్ణా నది ప్రాజెక్టు పనులు జరగలేదని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించారో కేసీఆర్, కేటీఆర్‌కే తెలియాలని ఆయన వ్యాఖ్యానించారు.