Ministers Engaged in Relief Operations in Flood Affected Areas:విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ కమిషనర్లతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. వరద ప్రభావం తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. విజయవాడలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టిందని మంత్రి నారాయణ తెలిపారు. వరద నీటి వల్ల కాలువల్లో చేరిన పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం 8.5 లక్షల టిఫిన్ ప్యాకెట్లు, 8.5 లక్షల భోజనం ప్యాకెట్లు, 5 లక్షల వాటర్ బాటిల్స్ బాధితులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. వరద నీరు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగు లేకుండా పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టామని అన్నారు.
ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావడానికి 10వేల మంది కార్మికులు అవసరమవుతారని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల కమిషనర్లకు వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని ఒక్కో సచివాలయానికి ఒక్కో ప్రత్యేకాధికారి ఉంటారని స్పష్టం చేశారు. వరద నీరు తగ్గగానే అగ్నిమాపకశాఖతో కలిసి ట్యాంకర్ల ద్వారా రోడ్లను శుభ్రం చేస్తామని అన్నారు. బ్లీచింగ్, ఫాగింగ్ పనులు చేపట్టి, మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.
ఎవరూ భయపడొద్దు - అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రజలకు మంత్రుల భరోసా - Ministers Visit Flooded Areas
వరద మూడు మార్గాల్లో చుట్టుముట్టింది: విజయవాడను మూడు మార్గాల్లో వరద నీరు చుట్టుముట్టిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కృష్ణానదితో పాటు బుడమేరు, మున్నేరు నుంచి ఒకేసారి వరద రావడంతో తీవ్ర ఇబ్బందులు కలిగాయని చెప్పారు. జనజీవనం సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రభుత్వం విశ్రమించదని అన్నారు. ఎక్కడా విద్యుత్ కొరత లేదని, వరద ఉన్న చోట్ల విద్యుత్ పునరుద్ధరిస్తే ప్రాణాపాయమనే ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందని మంత్రి పయ్యావుల తెలిపారు.