Minister Uttam Reacts on BRS Medigadda Tour : ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్(BRS) సర్కారు భారీగా అవినీతికి పాల్పడిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. స్వతంత్ర భారతంలో ఇంత భారీ అవినీతి గతంలో ఎన్నడూ జరగలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ సర్కారు అవినీతిని కాగ్ ఎండగట్టిందని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) కూడా వివరించిందన్నారు. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పర్యటనను స్వాగతిస్తున్నామన్నారు.
Minister Uttam fires on BRS :ఇంత భారీగా అవినీతి చేసి కూడా మేడిగడ్డ వెళ్తామంటున్నారని, బీఆర్ఎస్ నేతల (MedigaddaBarrage) పర్యటనకు సహకరించాలని అధికారులను ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల తీరు ఉల్టా చోర్ సామెతను గుర్తు చేస్తోంది. కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు కట్టాలని నిపుణుల కమిటీ గతంలో సూచించింది. కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.1.47 లక్షల కోట్లు కావాలని, మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టవద్దని నిపుణుల కమిటీ సూచించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
మేడిగడ్డ ఆనకట్ట పూర్తి కాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. "కాఫర్ డ్యాం తొలగించలేదు, అయినప్పటికీ డబ్బులు చెల్లించారు. నిర్మాణ సమయంలో ఎంత కాంక్రీట్ వాడాలి, ఏ సైజ్ బ్లాకులు వాడాలని కేసీఆర్ స్వయంగా చెప్పినట్లు మినట్స్‌లో స్పష్టంగా ఉంది. విజిలెన్స్ నివేదిక తర్వాత అన్ని విషయాలు బయట పెడతాం.ఎన్‌డీఎస్‌ఏ ఏమి చెబితే అది చేస్తాం. ఎల్ అండ్ టీ ఖర్చుతోనే మరమ్మత్తులు చేయాలని నేను గతంలోనే వారికి స్పష్టంగా చెప్పాను. చట్ట ప్రకారమే మేము వెళ్తాం, ఎవరిపైనా మాకు ప్రతీకారం లేదు, అవసరం లేదు. నీటిపారుదల శాఖను పునర్వ్యస్థీకరణ చేస్తాం. ఎస్సారెస్పీ రెండో దశ స్థిరీకరణ చేశామని బీఆర్ఎస్ చెప్పడం పూర్తిగా అబద్దం. సీఎం రేవంత్‌రెడ్డి, నేను కర్ణాటక వెళ్లి వేసవి తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేయాలని కోరతామని" మంత్రి ఉత్తమ్ తెలిపారు.