Minister Sridhar Babu On Education System : కోచింగ్ సెంటర్ల నియంత్రణపై కేంద్రం గైడ్‌లైన్స్‌ను అమలు చేసి వాటిని కట్టడి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్మీడియట్ కళాశాల ఫీజుల నిర్ధారణపై నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
ప్రభుత్వ స్కూళ్లు ప్రతిభా కేంద్రాలుగా :విద్యారంగ సంస్కరణలపై ఇవాళ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్ కమిటీ సభ్యురాలు పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రతిభా కేంద్రాలుగా తీర్చిదిద్దగలిగితే పేద విద్యార్ధులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లను వేర్వేరుగా నడపడం వల్ల మానవ వనరుల వృథా జరుగుతోందని రెండింటిని విలీనం చేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు. విద్యార్థులు లేని 1,600 పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు బదిలీ చేయాలని సూచించారు.
పాలిటెక్నిక్‌లను అప్‌గ్రేడ్ చేస్తాం : డిగ్రీ కళాశాలల్లో బీఏ కోర్సు పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసి విద్యార్థులను ఉద్యోగాలకు సంసిద్ధం చేసేలా శిక్షణ ఇవ్వాలని శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజినీరింగ్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసే పనులను వేగవంతం చేయాలని శ్రీధర్‌బాబు ఆదేశించారు. మాసబ్ ట్యాంక్, రామంతాపూర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం, సికింద్రాబాద్, కులీకుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభిస్తామని తెలిపారు.
విద్యాప్రమాణాల్లో రాష్ట్రం 34 వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లలో ఈ దుస్థితి నుంచి బయటపడాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. అన్ని పాఠశాలలు, కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు స్కూళ్లు కూడా ఈ దిశగా ముందడుగు వేసేలా చూడాలని తెలిపారు.