తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో కాలుష్యానికి చెక్​ - రేపటి నుంచి కొత్త 'ఈవీ' పాలసీ - వాటికి నో టాక్స్

రేపటి నుంచి కొత్త ఈవీ పాలసీ - వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్ - ఈ పాలసీ డిసెంబరు 31,2026 వరకు అమల్లో ఉండనున్న కొత్త పాలసీ

New EV Policy in Telangana
New EV Policy in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 2 hours ago

New EV Policy in Telangana : దిల్లీ మాదిరిగా హైదరాబాద్​లో కాలుష్యం కోరలు చాచకుండా ఉండేందుకు కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 2020 నుంచి 2030 వరకు ఎలక్ట్రిక్​ వెహికిల్​ పాలసీని తీసుకొచ్చారని చెప్పారు. సుమారు 5 వేల వాహనాల వరకు రాయితీ ఇచ్చి ఆతర్వాత చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం వినియోగదారులకు అధిక లాభం చేకూరే విధంగా నూతనంగా ఈవీ పాలసీని తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్​లోని సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ ఈవీ పాలసీ వివరాలను వెల్లడించారు.

జీవో నంబరు 41 ద్వారా రెండేళ్ల వరకు ఈవీ పాలసీని తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. ఈ పాలసీ 2026 డిసెంబరు 31 వరకు కొనసాగుతుందని అన్నారు. సోమవారం(రేపటి) నుంచి ఈ జీవో ద్వారా ఎలక్ట్రిక్​ వాహనాల పాలసీ అమల్లోకి వస్తుందన్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్​ వాహనాలకు పరిమితి లేదని చెప్పారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్​ను మార్చాలని సీఎం రేవంత్​ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈవీ ప్రణాళికలు తీసుకువచ్చని పేర్కొన్నారు.

ఆ వాహనాలకు వంద శాతం మినహాయింపు : ఎలక్ట్రిక్​ 4 వీలర్స్​, టూ వీలర్స్​, ఎలక్ట్రిక్​ ట్రాన్స్​పోర్ట్​ వాహనాలు, నాన్​ ట్రాన్స్​పోర్టు వాహనాలు, ఆటోలు, ఎలక్ట్రిక్​ బస్సులకు టాక్స్​తో పాటు రిజిస్ట్రేషన్​ టాక్స్​లో వందశాతం మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. తద్వారా వాహనదారులకు ఏడాదికి సుమారు రూ.లక్ష పైగా ఆదా అవుతుందని అన్నారు. హైదరాబాద్​లో ఇప్పుడున్న మూడు వేల బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్​ బస్సులు తేవాలని సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయించారని వెల్లడించారు.

త్వరలో సిటీ వ్యాప్తంగా ఎలక్ట్రిక్​ బస్సులు : త్వరలోనే సిటీలో మొత్తం ఎలక్ట్రిక్​ ఆర్టీసీ బస్సులు తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ స్పష్టం చేశారు. అదనపు ఈవీ ఛార్జింగ్​ స్టేషన్లు కోసం ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ ఈవీ పాలసీ కేవలం హైదరాబాద్​ జీహెచ్​ఎంసీ పరిధిలో మాత్రమే కాకుండా తెలంగాణవ్యాప్తంగా అమల్లో ఉంటుందని అన్నారు. ఈవీ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వండి.. భవిష్యత్​ తరాలను కాలుష్యం నుంచి కాపాడండి అని మంత్రి పొన్నం ప్రభాకర్​ పిలుపునిచ్చారు.

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్​ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే!

నగరంలో రోడ్డెక్కనున్న మరో 438 ఎలక్ట్రిక్ బస్సులు - ఈవీ ఛార్జింగ్ పాయింట్లపైనా టీజీఎస్​ ఆర్టీసీ ఫోకస్​ - TGSRTC on Electric Buses

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details