Ganesh Immersion 2024 : నగరంలో ఖైరతాబాద్ బడా గణేశ్ సహా, వినాయక నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇవాళ ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న ఆయన, స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మొదటిసారిగా గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ అందించామని తెలిపారు. నిమజ్జనం కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో 360 క్రేన్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. భక్తులు కూడా శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా సహకరించాలని కోరారు.
"నగరంలో ఖైరతాబాద్ బడా గణేశ్ సహా, వినాయక నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. రాష్ట్రంలో మొదటిసారి వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్‌ను అందించాము. నగరంలో వినాయక నవరాత్రులు విజయవంతంగా ముగిశాయి. ట్యాంక్‌బండ్ చుట్టూ 135 క్రేన్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 360 క్రేన్లను వినాయక నిమజ్జనాలకు ఏర్పాటు చేశాము. నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భక్తులు సహకరించాలని కోరుతున్నాం". - పొన్నం ప్రభాకర్, మంత్రి
మేయర్ ప్రత్యేక పూజలు : మరోవైపు ఖైరతాబాద్ శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి దర్శించుకున్నారు. స్వామి వారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గద్వాల విజయలక్ష్మిని కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేయర్, నిమజ్జనం కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో పూర్తి స్తాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జనం సాఫీగా సాగేందుకు ఎక్కడికక్కడ బేబీ పాండ్‌లను ఏర్పాటు చేశామన్నారు. 15 రోజులుగా నిమజ్జనం ఏర్పాట్ల కోసం పని చేస్తున్నట్టు వివరించారు.