Ponnam On Family Digital Cards : ఎన్నో సమస్యలకు పరిష్కారంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపొందించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని బీసీ సంక్షేమశాఖ, రవాణాశాఖమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తాహెర్ కొండాపూర్‌లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ప్రతి నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ ప్రారంభమైందన్నారు.
రైతు రుణమాఫీ కాని రైతుల సమస్య పరిష్కరిస్తాం :సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వంలా లక్షరూపాయలను నాలుగు సార్లు ఇవ్వడం లేదని ఒకే సారి మాఫీ చేశామన్నారు. రేషన్ కార్డు లేక రుణమాఫీ ఆగిన వాళ్లకు అతి త్వరలోనే వస్తుందని హామీ ఇచ్చారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపిన పొన్నం ప్రభాకర్ అందులో భాగంగానే తాను కరీంనగర్ జిల్లాలోని తాహెర్ కొండాపూర్‌లో ప్రారంభించేందుకు వచ్చానన్నారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ప్రయోజనాలు అనేకం :ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమంలో భాగంగా ఇంటి మహిళను గృహ యజమానిగా గుర్తించనున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతుబంధు, ఆరోగ్యశ్రీ, బీమాలకు ఈ కార్డు ఉపయోగపడుతుందని వెల్లడించారు. కుటుంబానికి గుర్తింపు ఉండేవిధంగా కార్డును తయారు చేస్తామన్నారు. డిజిటల్ కార్డుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పొన్నం తెలిపారు. కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు కూడా కార్డులో పొందుపరుస్తామని వివరించారు.