Bhu Bharathi Bill 2024 Presented In Telangana Assembly : శాసనసభలో భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలో ఉన్న భూ సమస్యల పరిష్కృతం కోసం ఈ బిల్లును తీసుకువచ్చామని తెలిపారు. బిల్లును ప్రవేశపెడుతూ, ఈరోజు చరిత్రాత్మక, రాష్ట్ర ప్రగతికి బాటలు వేసే రోజన్నారు. భూమి పేదరికాన్ని దూరం చేసి ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తుందని, గ్రామాల్లో భూమి ప్రధాన జీవనాధారం అని మంత్రి పేర్కొన్నారు. కష్టజీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలదని వివరించారు. 1971లో తెచ్చిన ఆర్‌వోఆర్ చట్టం 49 ఏళ్లపాటు మనుగడలో ఉందని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా అని అన్నారు. ఇందిరమ్మను ఇప్పటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారని తెలిపారు. గతంలో తెచ్చిన ధరణి పోర్టల్‌తో కొత్త సమస్యలు తలెత్తాయని ఆరోపించారు.
"కొత్త చట్టంలో భూదార్ అంశాన్ని చేర్చాం. ప్రతి రైతుకు భూదార్ కోడ్ అంశంపై కొత్త చట్టంలో ఉంది. గతంలో ప్రతి గ్రామంలో జమాబందీ జరిగేది. గతంలో 23 వేల మంది వీఆర్‌వోలు ఉండేవారు. ఒక్క కలం పోటుతో వీఆర్‌వో వ్యవస్థను రూపుమాపారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చారు. ఏటా జమాబందీ చేపట్టే అంశాన్ని కొత్త చట్టంలో పొందుపరిచాం. ల్యాండ్ ట్రైబ్యునల్ పునర్నిర్మాణంపై కొత్త చట్టంలో ఉంది. సీసీఎల్‌ఏ ద్వారా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై చట్టంలో ఉంది." - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి
నూతన ఆర్వోఆర్ చట్టం రూపురేఖలు ఎలా ఉండనున్నాయి? - Pratidhwani On New ROR Act