AP Cabinet Meeting Approvals Points : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టూ భర్తీ చేయలేదని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం మూడేళ్లుగా టెట్ నిర్వహించకపోవడం వల్ల డీఎస్సీ అభ్యర్థులు మార్కులు పెంచుకునే అవకాశం కోల్పోయారని వివరించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిందన్న మంత్రి పార్థసారథి, పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
వైఎస్‌ఆర్ ఆరోగ్య వర్సిటీ పేరును ఎన్టీఆర్ వర్సిటీగా మార్చామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వం వర్సిటీ పేరు మార్చడం వల్ల వైద్యులు అనేక ఇబ్బందులు పడ్డారని, వైద్యులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు వర్సిటీ పేరు మార్చామని వివరించారు. రాష్ట్రంలో గంజాయి అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, మత్తుపదార్ధాల నియంత్రణ కమిటీ వేశామని తెలిపారు. కమిటీ సూచనల మేరకు చర్యలు ఉంటాయని చెప్పారు.
వ్యవసాయరంగంలోనూ స్కిల్ డెవలప్‌మెంట్ : స్కిల్ డెవలప్‌మెంట్‌కు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి వెల్లడించారు. వ్యవసాయరంగంలోనూ స్కిల్ డెవలప్‌మెంట్ అమలుచేస్తామని తెలిపారు. అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తున్నామని చెప్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 183 అన్న క్యాంటీన్లను తెరుస్తున్నామని, మిగతా 20 క్యాంటీన్లను కూడా త్వరలో ప్రారంభిస్తామని వివరించారు.