Minister Partha Sarathy on Jogi Rajeev Arrest Issue : అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినందు వల్లే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని అరెస్టు చేసినట్లు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో అరెస్ట్ చేస్తున్నామంటూ వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి ఈ విషయంపై మాట్లాడారు. జోగి రాజీవ్‌ను అరెస్టు చేయటంలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని మంత్రి పార్థసారథి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. చట్టానికి కుల, మతాలతో సంబంధం ఉండదని ఆయన పేర్కొన్నారు.
జోగి రమేష్, ఆయన కుటుంబసభ్యుల పాపం పండింది: మంత్రుల ధ్వజం - AP MINISTERS ON JOGI RAJEEV ARREST
ప్రభుత్వం నిజంగానే కక్ష సాధింపులకు పాల్పడినట్లైతే జోగి రమేష్ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదని మంత్రి పేర్కొన్నారు. చట్ట పరంగానే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములను చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారన్నారు. అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములను కొనడం ఎంతవరకు సబబు? తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కొనుగోలు చేశారని లేవనెత్తారు. అగ్రి గోల్డ్‌లో డిపాజిట్‌లు చేసి పేదలు నష్టపోయారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్‌మెంట్‌లో ఉన్న తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అగ్రిగోల్డ్ ఫిర్యాదు మేరకే విచారించి చర్యలు తీసుకున్నారని మంత్రి వెల్లడించారు.