Minister Narayana on TDR Bonds: రాష్ట్రంలో చాలా చోట్ల అనుమతి లేకుండా టీడీఆర్ బాండ్లు జారీ చేసేశారని మంత్రి పి.నారాయణ అన్నారు. మొత్తం 7 వందల కోట్లు మేర జారీ అయ్యాయన్నారు. బాండ్ల జారీ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని భావిస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళికలు లేవని అన్నారు. 5 వేల 300 కోట్లు ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకు నుంచి రుణం తెస్తే, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిధులు వృథా చేశారని ఆరోపించారు.
2019 ఫిబ్రవరిలో తెచ్చిన రూ.5300 కోట్లలో కేవలం రూ.200 కోట్లే ఖర్చు పెట్టారని, కనీసం మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. గతనెల 30న గడువు ముగిసిందని, నిధులు ఖర్చు చేసి ఉంటే ఏపీలో 50 శాతం మున్సిపాలిటీలకు సౌకర్యాలు వచ్చేవన్నారు. ఆ ప్రాజెక్టును పొడిగించాలని కోరుతూ లేఖ పంపామన్నారు.
సమస్యల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: మంత్రి నారాయణ - Minister Narayana on municipalities
తాగునీటి కోసం తెచ్చిన అమృత్-1, 2 నిధులూ ఖర్చు చేయలేదని అన్నారు. అవి వినియోగించుకుంటే రాష్ట్రంలో తాగునీటి మౌలిక సదుపాయాలకు ఇబ్బంది ఉండేది కాదని అన్నారు. పట్టణ ప్రాంతల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలపై దృష్టి పెట్టామన్నారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీ నిధులు ఇష్టానుసారంగా వాడేసిందని, నిధులను దారి మళ్లించారని మంత్రి నారాయణ ఆరోపించారు.
నెల్లూరు, కడపలో లే అవుట్స్‌లో అవకతవకలు జరిగినట్లు గుర్తించామన్నారు. లేఅవుట్ అనుమతుల్లో అక్రమాలపై కమిటీలు వేయాలని ఆదేశించామన్నారు. కమిటీల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. తణుకులో టీడీఆర్ బాండ్లలో అక్రమాలు జరిగాయన్న నారాయణ, రూ.36 కోట్ల మేర బాండ్లు ఇవ్వాల్సి ఉంటే రూ.700 కోట్ల మేర ఇచ్చారని ఆరోపించారు.