Minister Narayana Inspects AIIMS Water Supply Works:మంగళగిరి ఎయిమ్స్‌కు త్వరలోనే నీటి కష్టాలు తీరనున్నాయి. ఎయిమ్స్ ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంతవరకూ నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. గత ప్రభుత్వం కూడా ఎయిమ్స్‌కు నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఇప్పటి వరకూ ఎయిమ్స్ సిబ్బంది, అక్కడికి వచ్చే రోగులు, ఇతర ప్రజల అవసరాలకు తగినట్లుగా తాగునీరు అందడం లేదు. గుంటూరు చానల్, ఆత్మకూరు చెరువుల నుంచి ఎయిమ్స్‌కు నీటి సరఫరా చేయాలని నిర్ణయించినప్పటికీ దానికి సంబంధించిన పనులు మాత్రం పెండింగ్‌లోనే ఉన్నాయి.
దీంతో ప్రతిరోజూ సుమారు 3 లక్షల లీటర్ల తాగునీటిని ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి కష్టాలు తీర్చేలా వేగంగా ముందుకెళ్తుంది. గుంటూరు ఛానల్, ఆత్మకూరు చెరువు నుంచి ఎయిమ్స్ వరకూ నీటిని సరఫరా చేసేందుకు పైప్ లైన్ల నిర్మాణం పూర్తి చేసింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. పైప్ లైన్ల ద్వారా వచ్చిన నీటిని పూర్తిగా శుద్ది చేసి సరఫరా చేసేలా సంపులు, ఫిల్టర్ బెడ్లు నిర్మాణం వేగంగా జరుగుతుంది.