Lokesh on Tirumala Laddu Issue :వైఎస్సార్సీపీ నేతలు టీటీడీలో కూడా అవినీతి చేశారని మంత్రి లోకేశ్ ఆరోపించారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఇవ్వని మెజార్టీని ప్రజలు తమకు ఇచ్చారని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటామని వారి సమస్యలు తీరుస్తామని పేర్కొన్నారు. వారికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు.
వైఎస్సార్సీపీ నాయకులు దేవుడిని ప్రజలకు దూరం చేస్తున్నారని గతంలో చెప్పానని లోకేశ్ గుర్తు చేశారు. వారు చేసిన తప్పులను ప్రక్షాళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూతలపట్టు, బంగారుపాళ్యం గ్రామాలు తన గుండెల్లో ఉంటాయని వివరించారు. గతంలో ఓ డీఎస్పీ తనపై దాడి చేస్తే ఇక్కడి ప్రజలు తమకు అండగా ఉన్నారని వెల్లడించారు. బంగారుపాళ్యం గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని తెలిపారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పరిపాలన మొదలైందని విమర్శించారు. జగన్ అరాచకాలు ప్రజలకు తెలియాలనే ప్రజావేదిక శిథిలాలు తొలగించలేదని లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం : అంతకుముందు లోకేశ్ యువగళంలో ఇచ్చిన హామీ మేరకు బంగారుపాళ్యంలో డయాలసిస్ సెంటర్ను అదేవిధంగా కొత్తగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని లోకేశ్ తెలిపారు. చిత్తూరు జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని మంత్రి చెప్పారు.