Minister Nara Lokesh On Mega DSC 2024 :వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఆయన ప్రసంగించారు. గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ నియామకాలు సున్నా అని విమర్శించారు. గత ప్రభుత్వంలో డీఎస్సీ (DSC) ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత వదిలేశారని అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి సంతకమే మెగా డీఎస్సీపైనే చేశామని గుర్తు చేశారు. మొత్తం 16,345 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్టు శాసనసభకు వెల్లడించారు. టీడీపీ హయాంలో మొత్తంగా 15 సార్లు డీఎస్సీ నిర్వహించామని వెల్లడించారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకు వయో పరిమితిని పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం - రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తి : లోకేశ్
గత ప్రభుత్వ హయాంలో 6 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారని లోకేశ్ ఆరోపించారు. ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకునేందుకు తమ ప్రభుత్వ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాలతో గత ఐదు నెలలుగా చర్చిస్తూనే ఉన్నామన్నారు. జీవో 117 కు ప్రత్యామ్నాయం చేస్తామన్నారు. ఎక్కడా వేధింపులు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యం అన్నారు. అలాగే పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫొటోలు తీయటం ఉపాధ్యాయుల బాధ్యత కాదని ఇప్పటికే తేల్చి చెప్పామన్నారు. ఉపాధ్యాయులపై వైఎస్సార్సీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్‌లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామని తెలిపారు.