Lokesh on IT Development in AP : విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధిపై శాసనసభ్యుల ప్రశ్నలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని అనే నినాదం కూటమి ప్రభుత్వానిదని లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తేవడమే తన టార్గెట్ అని చెప్పారు. అదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నామని వెల్లడించారు. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని గతంలోనే హామీ ఇచ్చామని గుర్తుచేశారు. దాని కోసమే డేటా సెంటర్ పాలసీని కూడా రూపకల్పన చేశామని ఆయన వివరించారు.
సమావేశాలు నిర్వహించాం : గత ప్రభుత్వ పాలనలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు సంబంధించిన ఒక్క కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదని లోకేశ్ విమర్శించారు. వైఎస్సార్సీపీ హయాంలోని ఐటీ మంత్రి గుడ్డూ-కోడి అంటూ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో ఏపీ ఐటీ మంత్రి ఇలా ఉంటారా అంటూ కూడా గతంలో కొందరు మాట్లాడారన్నారు. గడచిన ఐదు నెలల్లో చాలా ఐటీ సంస్థలతో సమావేశాలు నిర్వహించామని లోకేశ్ తెలిపారు.
'మూడు నెలల్లో టీసీఎస్ సంస్థ విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది. విశాఖలో ఐటీ ఎకో సిస్టం ఏర్పాటు కోసం ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు చేస్తున్నాం. డేటా సెంటర్లు హైదరాబాద్, ముంబయి, చెన్నైలో మాత్రమే ఉన్నాయి. డేటా సెంటర్లపై 300 బిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నాం. టీడీపీ తెచ్చిన డేటా సెంటర్ పాలసీ ప్రకారం అవి వస్తే విశాఖ ప్రపంచ డేటా సెంటర్ అయి ఉండేది.' అని లోకేశ్ పేర్కొన్నారు.
ఐటీ కంపెనీలు రావాలంటే సామాజిక మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి. అందుకే భోగాపురం లాంటి అంతర్జాతీయ విమానాశ్రయం వేగంగా నిర్మిస్తున్నాం. అలాగే వేలాది హోటళ్లు కూడా ఏర్పాటు కావాల్సి ఉంటుంది. అందుకే టూరిజం పాలసీ కూడా రూపొందించాం, పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. విశాఖకు గ్రేడే ఆఫీస్ స్పేస్, నివాస స్థలాలు కూడా ఉండాలని అందుకే రియల్ ఎస్టేట్ కంపెనీలతోనూ చర్చిస్తున్నాం. - నారా లోకేశ్, ఐటీ శాఖ మంత్రి
AP Assembly Sessions 2024 : మరోవైపు పెండింగ్ ఇన్సెంటివ్‌లు చెల్లించేందుకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించామని లోకేశ్ వివరించారు. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి పెట్టాలని టీసీఎస్ చంద్రశేఖరన్ చెప్పారని తెలిపారు. కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్లపై రిలయన్స్‌కు అభినందనలు తెలియచేస్తే వారు రాష్ట్రంలో 700 యూనిట్లు పెడతామని హామీ ఇచ్చారని లోకేశ్ వెల్లడించారు.