Nara Lokesh Visit America Updates :రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్లను మంత్రి ఆహ్వానించారు.
మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఉందని సత్య నాదెళ్ల వివరించారు. అక్టోబర్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్ 3.1 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ కలిగి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉందని చెప్పారు. 2023 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ దాని క్లౌడ్ సేవలు, ఏఐ-డ్రైవెన్ సొల్యూషన్ రంగంలో బలమైన వృద్ధితో 211.9 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిందని సత్య నాదెళ్ల వెల్లడించారు.
'ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నాం. ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరమని విజ్ఞప్తి చేస్తున్నాం. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి తమ వద్ద అందుబాటులో ఉన్నాయి' అని లోకేశ్ తెలిపారు.
Lokesh Meet Satya Nadella :క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి తాము అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నట్లు లోకేశ్ స్పష్టం చేశారు. అగ్రిటెక్‌కు ఏఐని అనుసంధానించడం వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఆకాంక్షించారు. మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకతను పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.
'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా స్ట్రీమ్ లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్‌ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో-బిజినెస్ పాలసీలతో రాష్ట్రం వ్యాపార, వాణిజ్యరంగాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తెచ్చాం. ఏపీలో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్ వ్యూహాత్మక లాజిస్టిక్లకు అనువుగా ఉంటాయి. క్లౌడ్-ఆధారిత ప్లాట్ ఫాంలను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రోసాఫ్ట్ సహకారాన్ని కోరుతున్నాం' అని లోకేశ్ పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తయారు చేయాలని భావిస్తున్నామని లోకేశ్ వివరించారు. ఇందులో భాగంగా ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్ టెక్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సత్య నాదెళ్లను ఆయన కోరారు. ఈ సందర్భంగా పలువురు మైక్రోసాఫ్ట్ తెలుగు ఉద్యోగులు లోకేశ్‌తో ఫొటోలు దిగారు.
యాపిల్ కార్యకలాపాల విస్తరణకు ఆహ్వానం : ఆ తర్వాత యాపిల్ సంస్థ ప్రతినిధులతోనూ లోకేశ్ భేటీ అయ్యారు. శాన్ఫ్రాన్సిస్కోలోని యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. భారత్‌లో యాపిల్ కార్యకలాపాల విస్తరణకు ఏపీ ఆహ్వానం పలుకుతోందని లోకేశ్ తెలిపారు. ఈ మేరకు అవసరమైన మద్దతు ప్రభుత్వ తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొని ఉన్న 4 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో యాపిల్‌కు అనుకూలమైన ప్రాంతాన్ని అన్వేషించాలని కోరారు. సంస్థ కోరుకున్న చోట తయారీ యూనిట్ స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని లోకేశ్ వివరించారు.