Minister Nara Lokesh Fire on Jagan:ప్రకాశం బ్యారేజీని కూల్చి లక్ష మందికి పైగా ప్రజలను చంపాలన్నదే జగన్ లక్ష్యమని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు. అధికారం అండతో జగన్ ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేశారని గుర్తుచేశారు. 50 మందిని చంపేసి 5 ఊళ్లు నామరూపాలు లేకుండా చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని కూల్చేసి విజయవాడతో పాటు లంక గ్రామాలను నామ రూపాల్లేకుండా చేయాలని చూశారన్నారు. లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందని తెలిపారు.
ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలనే కుట్ర ప్లాన్ చేసింది జగన్ అయితే దాన్ని అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అని ఆరోపించారు. వారి కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ జగన్ ముఠా విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
Varla Ramaiah:ప్రకాశం బ్యారేజ్‌ను ఇసుక పడవలు ఢీ కొట్టడం జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాంల కుట్రేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. జగన్ గత ఐదేళ్ల పరిపాలన అంతా అరాచకం, అస్తవ్యస్తమని మండిపడ్డారు. కుట్రలు కుతంత్రాలతో కూడుకున్న పాలన జగన్‌దని విమర్శించారు. జాతీయ సంపదైన ప్రకాశం బ్యారేజ్‌ను కుట్రతో ధ్వంసం చేయాలనుకున్నారని ఇది దేశ ద్రోహం నేరంతో సమానమని తెలిపారు.
చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కుట్ర పన్ని పడవలతో బ్యారేజ్‌ను ఢీ కొట్టేలా ప్లాన్ చేశారని ధ్వజమెత్తారు. ఆ పడవలు సరిగా బ్యారేజ్‌ను ఢీకొని ఉంటే ఆ ప్రమాదం ఉప్పెన కంటే ఘోరంగా ఉండేదని ఊర్లన్నీ మునిగిపోయి ప్రజల ధన, ప్రాణాలు పోయేవన్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కూడా ఇది కుట్ర అని ఈ పడవల ఢీ కొన్నదాని వెనుక ఎవరు ఉన్నా శిక్షిస్తామని వారు తెలిపినట్లు వర్ల రామయ్య అన్నారు.