Nara Lokesh Visit America Updates : ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన సాగుతోంది. ఈ క్రమంలోనే శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని లోకేశ్ తెలిపారు. యువతకు రాబోయే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఆరు పాలసీలను ప్రకటించారని చెప్పారు.
ప్రవాసాంధ్రుల నుంచి పెద్దఎత్తున పెట్టుబడుల కోసం చంద్రబాబు ఎదురుచూస్తున్నారని లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని లోకేశ్ వెల్లడించారు.
Lokesh Said AP as Investment Destination : కృష్ణా, గుంటూరు క్యాపిటల్ రీజియన్‌లో 5 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని లోకేశ్ వివరించారు. డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ డేటా సెంటర్ రానున్నట్లు తెలిపారు. త్వరలో టీసీఎస్ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.
భారత్‌లో డాటా రివల్యూషన్ రానున్నట్లు ఎలక్ట్రానిక్స్ రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి తెలిపారు. అందులో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు శ్రీకర్‌రెడ్డి వివరించారు.