Minister Lokesh Chit Chat With Media in Assembly Lobby : తెలుగుదేశం శ్రేణుల ధైర్యాన్నీ వైఎస్సార్సీపీ శ్రేణుల పిరికితనాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గత ఐదేళ్లు తెలుగుదేశం శ్రేణుల్ని పోలీసులు అక్రమ కేసులతో ఎంత వేధించినా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెట్టిన అసభ్యకర పోస్టులపై ఇప్పుడు పోలీసులు చిన్న నోటీసు ఇస్తున్నా రాజకీయ సన్యాసం అంటూ వైఎస్సార్సీపీ నేతలు పిరికితనం చాటుతున్నారని ఎద్దేవా చేశారు.
నాడు తెలుగుదేశం శ్రేణులు తప్పుచేయలేదు కాబట్టే అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారని వెల్లడించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు తప్పు చేసి అడ్డంగా దొరికారు కాబట్టే సారీలు, రాజకీయ సన్యాసాలు అంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలదని లోకేశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని పేర్కొన్నారు.
జగన్ తన అభ్యర్థులు కమిటీల ఓటింగ్‌కు వస్తున్నారా అని ఎమ్మెల్యేలను ఆరా తీశారు. బలం లేనప్పుడు పోటీ ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. ఓటింగ్‌కు రావాలా వద్దా అనే మీమాంసలో ఎందుకు పడాలన్నారు. నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లపై ఎమ్మెల్యేలతో లోకేశ్ చర్చించారు. ప్రజలు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించారంటే వారి ఆశలు కూడా ఎక్కువగానే ఉన్నాయనే విషయం మర్చిపోకూడదని స్పష్టం చేశారు. జాగ్రత్తగా పని చేయమని బాధ్యతనిస్తూ ఎక్కువ ఓట్లతో మనల్ని ప్రజలు గెలిపించారన్నారు.