Minister Kondapalli Srinivas Visit in Vizianagaram GGH: విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలను పెంపొందించే దిశగా చర్యలు చేపడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, ఎమ్మెల్యేలు అదితి, కోళ్ల లలిత కుమారి సందర్శించారు. అనంతరం జీజీహెచ్‌లో నెలకొన్న సమస్యలపై వైద్యులు, అధికారులతో మంత్రి కొండపల్లి సమీక్షించారు. ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలను మంత్రి పరిశీలించారు. జీజీహెచ్‌లో సేవల మెరుగుదల కోసం వైద్యులు, అధికారులతో మరోసారి సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు.
కేంద్ర ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలను పెంపొందించడమే లక్ష్యంగా ఆసుపత్రిని సందర్శించామన్నారు. జిల్లా ప్రజలకు రానున్న రోజుల్లో జీజీహెచ్ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ విభాగంలో రోగులు కూర్చొనేందుకు తగిన వసతులు లేవని గుర్తించామన్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో రక్తం కొరత ఉందని దాన్ని అధిగమించేందుకు రక్తదాన శిబిరాలను నిర్వహించి రక్తం నిల్వలు పెంపొందించేందుకు చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. ఆసుపత్రిలో పెరిగిన రోగుల సంఖ్య ఆధారంగా అదనంగా 20 చక్రాల కుర్చీలు, 10 స్ట్రెచర్‌లు సమకూరుస్తున్నట్లు మంత్రి చెప్పారు. అదే విధంగా మరమ్మత్తులకు గురైన ఎంఆర్ఐ స్కానింగ్‌ను త్వరగా పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.