Minister Dola Bala Veeranjaneya Swamy on Volunteers :వాలంటీర్లను తీసేస్తామని తాము చెప్పలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. సచివాలయం మూడో బ్లాక్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు. సింగరాయకొండలో బైపీపీలో 40, ఎంపీసీలో 40 సీట్లను గత ప్రభుత్వం రద్దు చేయగా, వాటిని పునరుద్ధరిస్తూ ఆయన తొలి సంతకం చేశారు.
Minister Dola Took Charge as Minister : అదేవిధంగా పర్చూరు నియోజకవర్గం, నాగులుపాలెం గురుకుల పాఠశాలలో పైలెట్ ప్రాజెక్టు కింద రూ.15 లక్షలతో సోలార్ ప్రాజెక్టును, వేడినీటి కోసం మంజూరు చేశామని డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అక్కడే పాఠశాలలకు అందించే పండ్లు, కూరగాయలు, గుడ్లు నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.9 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
గత ప్రభుత్వ బకాయిలను మేము చెల్లించాల్సి వస్తోంది : మరోవైపు 2014-2019 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు ఇచ్చామని డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. కానీ జగన్ సర్కార్ ఆ సీట్లను రద్దు చేసిందని మండిపడ్డారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి రూ.2505.56 కోట్లు, ఎస్సీ విద్యార్థులకు రూ.131.82 కోట్లు బకాయిలు పెట్టిందని విమర్శించారు. వాటిని ఇప్పడు తాము చెల్లించాల్సి వస్తోందని, లేకపోతే విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి ఉందని డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.