Minister Anam Ramanarayana Reddy Fires on YS Jagan: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి ఘటన అందరినీ కలచి వేసిందని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై అప్పటికప్పుడే ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు.
జగన్పై విమర్శలు గుప్పించిన ఆనం:జగన్ అహంకారాన్ని ప్రదర్శిస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి వందలాది మంది ఆసుపత్రిలోకి వచ్చి గందరగోళం సృష్టించారని మంత్రి రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా సైతం లేని జగన్ బాధితులను పరామర్శించేందుకు తిరుపతికి వచ్చి రాజకీయం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉన్నారనీ, ఆయన వెళ్లిన తర్వాత రమ్మని జగన్కు అధికారులు సూచిస్తే వైఎస్సార్సీపీ నాయకులతో వచ్చి మరీ గొడవ చేశారని ఆనం అన్నారు. ఐసీయూ రూములలోకి వెళ్లొద్దని డాక్టర్లు వారిస్తున్నా వాళ్లను ఖాతరు చేయలేదని ఆయన వివరించారు.
దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నియామకంపై విచారణ: మంత్రి ఆనం
ప్రోటోకాల్ గురించి జగన్కు తెలియదా? ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్కు ఐసీయూ ప్రోటోకాల్ గురించి కనీసం తెలియదా? అని ప్రశ్నించారు. అయినప్పటికీ అధికారులు ఆయనకు సహకరించారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. కానీ అందుకు విరుద్ధంగా పేషెంట్లకు పెట్టిన సెలైన్ బాటిళ్లను కూడా పక్కకు తోసేయడం శోచనీయమన్నారు. జగన్ నిన్న దుష్ట చతుష్టయ యాత్రను చేశారు.