తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంకా నిర్లక్ష్యం చేస్తే తొమ్మిదో స్థానానికి పడిపోతాం : ఎన్వీఎస్‌రెడ్డి - NVS REDDY ON METRO EXPANSION

మెట్రో విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామన్న మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి - మెట్రో విస్తరణ లేకపోవడంతో మూడో స్థానంలో ఉన్నామని వెల్లడి - ఇంకా నిర్లక్ష్యం చేస్తే తొమ్మిదో స్థానానికి పడిపోతామని వ్యాఖ్య

NVS REDDY ABOUT CM REVANTH REDDY
NVS Reddy About Metro Expansion in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 5:16 PM IST

Updated : Nov 26, 2024, 8:47 PM IST

NVS Reddy About Metro Expansion in Hyderabad :హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు ప్రయాణం నగర వాసులకే కాకుండా యావత్ తెలంగాణకు గర్వకారణంగా నిలిచిందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్​రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు మెట్రో రైలు ఏడేళ్లు పూర్తి చేసుకుందని తెలిపిన ఆయన, ఇప్పటి వరకు 63 కోట్ల 40 లక్షల మంది ప్రయాణించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 69 కిలోమీటర్లలో మొదటి దశలో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. మెట్రో వద్దని తన దిష్టిబొమ్మలు దహనం చేసిన వాళ్లే నేడు మెట్రో కోసం పుష్పగుచ్చాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.

గత పదేళ్లలో మెట్రో మార్గాల విస్తరణకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో దిల్లీ, బెంగళూరు తర్వాత హైదరాబాద్ మూడో స్థానానికి పడిపోయిందని ఎన్వీఎస్​రెడ్డి అన్నారు. వెంటనే విస్తరణ పనులు చేపట్టకపోతే హైదరాబాద్ తొమ్మిదో స్థానానికి పడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లో రూ. 50 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు విస్తరణ ప్రాజెక్టులు చేపట్టాయని గుర్తుచేశారు. మెట్రో విస్తరణకు హైదరాబాద్​లోనూ డిమాండ్ పెరగడంతో మొదటి దశ అనుభవాలతో రెండో దశ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి వివరించినట్లు తెలిపారు.

10 నెలల్లో 10 సమీక్ష సమావేశాలు నిర్వహించి రెండో దశ మెట్రో రైలును నగరం నలువైపులా అందుబాటులోకి ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపినట్లు మెట్రో ఎండీ వివరించారు. రెండోదశలో ఆరు కారిడార్లలో 116.4 కిలో మీటర్లను నిర్ణయించగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గాన్ని తర్వాతి దశలో నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం సర్వే జరుగుతున్నట్లు వివరించారు. మిగిలిన 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మార్గానికి మూడు నెలల్లో డీపీఆర్​లు సిద్ధం చేసి కేంద్రానికి పంపినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలపారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్ ఏజెన్సీ పేరుతో నిర్మిస్తున్న ఐదు కారిడార్లలో ప్రతి కిలో మీటర్​కు 318 కోట్ల రూపాయలు అవుతున్నాయని, ఇది చెన్నై, బెంగళూరుతో పోల్చితే తక్కువేనని వెల్లడించారు.

'ఇప్పుడు చాలా మంది ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఇంతకుముందు చైనాలో ఇన్వెస్ట్​మెంట్​ చేసేవారు. మెట్రోకు సంబంధించిన ఎంత నిధులు కావాలన్నా విడుదల చేస్తానని సీఎం రేవంత్​ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వకముందే పనులన్నీ ప్రారంభించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. రెండో దశలో ఎలాంటి సమస్యలు రావు. దాదాపు నాలుగేళ్లల్లో పూర్తి చేస్తామని నమ్మకం ఉంది'-ఎన్వీఎస్‌ రెడ్డి, మెట్రోరైలు ఎండీ

అవకాశం ఉన్న చోట డబుల్ డక్కర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు నిధుల సమస్యేమీ ఉండని ఆశాభావం వ్యక్తం చేసిన ఎన్వీఎస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 7 వేల 313 కోట్ల రూపాయలు కేటాయిస్తుందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఎంతో సానుకూలంగా ఉన్నారని, ప్రాజెక్టు వేగవంతం కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే పాతబస్తీకి సంబంధించి భూసేకరణ కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మెట్రోరైలు సగటు వేగం గంటకు 35 కిలోమీటర్లు కాగా విమానాశ్రయం వరకు ఆ వేగం పెంచే అవకాశం ఉందన్నారు. అలాగే ఎంఎంటీఎస్, ఆర్టీసీ, స్విడా, ర్యాపిడో వంటి రవాణా మార్గాలతో అనుసంధానం చేసే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.

ప్రారంభంలో 3 కోచ్​ల రైళ్లు ఉంటాయని, తర్వాత 6 కోచ్​లతో పెంచుతారని, అందుకు అనుగుణంగానే స్టేషన్ల నిర్మాణం జరుగుతుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఫేజ్ -I అనుభవంతో పార్కింగ్, బస్ బేలు, ఆటో, ఫీడర్ సర్వీసులు మొదలైన వాటి కోసం గ్రౌండ్ లెవెల్లో మరింత స్థలం సేకరణపై దృష్టి సారించడం జరుగుతుందని చెప్పారు. నాగోలు నుంచి విమానాశ్రయం వరకు స్టేషన్ల సంఖ్య తగ్గుతుందని, మెట్రో స్టేషన్లకు పేర్ల విషయంలోనూ ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని ఎన్వీఎస్​రెడ్డి తెలిపారు. విమానాశ్రయానికి ముందు 1.6 కిలోమీటర్లు భూగర్భ మార్గంలో మెట్రో రైలు ఉంటుందని, మియాపూర్ నుంచి పటాన్​చెరు వరకు అవకాశం ఉన్న చోట డబుల్ డక్కర్ వస్తుందన్నారు.

2025 జనవరి నుంచి ప్రాథమిక పనులు :పటాన్​చెరు నుంచి హయత్​నగర్ వరకు పూర్తి కారిడార్ అందుబాటులోకి వస్తే ఒకే రైలులో మొదలు నుంచి చివరి వరకు ప్రయాణించవచ్చని, తద్వారా రహదారిపై ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం నిరీక్షించకుండానే మెట్రో రైలు రెండో దశ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సూచన మేరకు భూసేకరణను వేగవంతం చేశామని, పాతబస్తీలో ప్రభావితమైన 1100 ఆస్తుల్లో 800 ఆస్తి వివరాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్​కు పంపించిట్లు వివరించారు. అందులో 200 ఆస్తులకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారని, అన్ని న్యాయపరమైన చిక్కులను అధిగమించి భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ నెలఖారు నుంచి పాతబస్తీలో సేకరించిన ఆస్తుల కూల్చివేత ప్రారంభమవుతుందని, 2025 జనవరి నుంచి ప్రాథమిక పనులు ఆరంభమవుతాయని ఎన్వీఎస్​రెడ్డి వెల్లడించారు. మొదటి దశలో రోజుకు 5 నుంచి 6 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, రెండో దశ మెట్రో రైలు అందుబాటులోకి వస్తే రోజుకు 10 లక్షల మందికిపైగా ప్రయాణిస్తారని అంచనా వేశారు. మరోవైపు టికెట్ ధరల పెంపు ఆలోచన ప్రస్తుతానికి లేదని, ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించడం లేదని ​స్పష్టం చేశారు. ఇటీవల మెట్రో రైలు వల్ల ఎల్ అండ్​టీకి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుందనే తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేయడాన్ని ఎన్వీఎస్​రెడ్డి ఖండించారు.

హైదరాబాద్​ మెట్రోకు ఏడాదికి రూ.1,300 కోట్లు నష్టం - షాకింగ్ న్యూస్ చెప్పిన ఎండీ

మెట్రో ప్రయాణికుల కోసం సరికొత్త సర్వీస్- ఇకపై మీ జర్నీ మరింత ఈజీ..!

Last Updated : Nov 26, 2024, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details