METHANOL PLANT IN TELANGANA:సింగరేణి మరో కొత్త వ్యాపార సంస్థను సిద్ధం చేస్తోంది. దేశంలోనే తొలిసారి ఈ సంస్థకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గాలిలోకి వెలువడే కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ ప్లాంట్ను ప్రయోగాత్మకంగా నిర్మిస్తోంది. కోల్ ఇండియా ప్రైవేటు సంస్థలతో కలిసి చేసిన ప్రయోగం సఫలమైతే భారీ మిథనాల్ యూనిట్ స్థాపించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో గల సింగరేణి థర్మల్ విద్యుత్కేంద్రం పక్కనే ఈ ప్లాంటును నిర్మిస్తోంది. థర్మల్ విద్యుత్కేంద్రంలో బొగ్గును మండించగా వెలువడే వాయువు నుంచి రోజుకు 500 కేజీల కార్బన్ డైయాక్సైడ్ ను సేకరించి, హైడ్రోజన్ తో కలిపి చివరిగా మిథనాల్ ద్రవాన్ని పొందేలా ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. సింగరేణి థర్మల్ విద్యుత్కేంద్రంలో బొగ్గు మండించగా వాటి ఉద్గారాలను వాతావరణంలో కలవకుండా నివారించడానికి ఇ. ఎస్. పి. (ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపిటేటర్స్) ను నెలకొల్పింది.
థర్మల్ ప్లాంట్ చిమ్నీకి అనుబంధంగా ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. సింగరేణి నిర్మాణ సారధ్యంలో కోల్ ఇండియా అనుబంధ యూనియన్ అయిన సీఎం పీడీఐఎల్ ఆర్థిక సహకారంతో నిర్మాణం చేపట్టారు. నిర్మాణ బాధ్యత, ప్లాంట్ నిర్వహణను బెంగుళూరుకు చెందిన జవహర్ లాల్ సెంటర్ ఫర్ అడ్వాన్సుడు సైంటిఫిక్ రీసెర్చ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. దీని నిర్మాణం వచ్చే నెల 31 నాటికి పూర్తికానుంది. త్వరలో ఇది లాంఛనంగా ప్రారంభం కానుంది.