Merchant Cheated Mirchi Farmers: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట రైతులకు మిర్చి వ్యాపారి కోటి రూపాయల టోకరా పెట్టాడు. దీంతో రెండు గ్రామాల రైతులు లబోదిబోమంటున్నారు. వరుస తెగుళ్లతో గడిచిన మూడేళ్లుగా మిర్చి రైతులు నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది కూడా అరకొరగా వచ్చిన దిగుబడులతో పెట్టుబడులకు చేసిన అప్పులు తీరక అన్నదాతలు మరింత అప్పుల్లో కూరుకుపోయారు. ఇలాంటి తరుణంలో పెనుగంచిప్రోలు మండలం కొళ్లికూళ్ల, వెంకటాపురం గ్రామాలకు చెందిన రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసిన వ్యాపారి రైతులకు సుమారు కోటి రూపాయలు టోకరా పెట్టి పారిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
అందినచోట అప్పులు చేసి ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటంతా వ్యాపారి దోచేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రెండు గ్రామాలకు చెందిన సుమారు 51 మంది రైతుల నుంచి కంచికచర్లకు చెందిన మిర్చి వ్యాపారి మిర్చి కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించి రైతులకు రూ. 97 లక్షలు చెల్లించాల్సి ఉంది. నెల రోజుల వాయిదా పద్ధతిలో కొనుగోలు చేసి నెలల తరబడి రైతులను తిప్పుకున్నారు. విసుగు చెందిన రైతులు కంచికచర్లలోని వ్యాపారి ఇంటికి వెళ్లగా ఐపీ నోటీసు దాఖలు చేసి పరారైనట్లు రైతులు గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. అయిదు రోజుల క్రితం పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో వ్యాపారిపై కేసు పెట్టారు. కలెక్టర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
పండుఈగతో మామిడి రైతుకు నష్టం - ఎరువులపై సబ్సిడీ ఇవ్వని ప్రభుత్వం - Loss Money to Mango Farmers