కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణ చర్యలు వేగవంతం - పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసే మార్గాలపై అన్వేషణ (ETV Bharat) Medigadda Barrage Temporary Repairs 2024 :జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు వర్షాకాలం లోపు తీసుకోవాల్సిన రక్షణ చర్యలను నీటిపారుదలశాఖ వేగవంతం చేసింది. ఆయా బ్యారేజీల నిర్మాణ సంస్థలు ఈ దిశగా ఇప్పటికే చర్యలను ప్రారంభించాయి. పియర్స్ దెబ్బతిన్న మేడిగడ్డ ఆనకట్టకు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని గేట్లు తెరిచే ప్రక్రియ కొనసాగుతోంది. బ్లాకులో ఎనిమిది గేట్లు ఉండగా అందులో ఇప్పటికే ఐదు గేట్లను తెరిచారు. మిగిలిన మూడు గేట్లను కూడా తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎన్డీఎస్ఏ నిపుణల కమిటీ 20, 21వ గేట్లను పూర్తిగా తొలగించాలని సూచించింది. అయితే తొలగించడం కంటే గేట్లను తెరవడమే సులువన్న వాదన ఉంది. పియర్స్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా తెరిస్తే మేలని అంటున్నారు. దిగువన రాఫ్ట్‌ను సరిచేసుకొని గేట్లను తెరవాల్సి ఉంటుంది. పియర్స్ కుంగిన ప్రాంతంలో ఇసుక కొట్టుకుపోయి రంధ్రం ఏర్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినందున దాన్ని పూడ్చి గేట్లను తెరవాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో దెబ్బతిన్న సీకెంట్ పైల్స్ స్థానంలో కొత్త వాటిని అమర్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త సీకెంట్ పైల్స్ నేడో, రేపో చేరుకుంటాయని అంటున్నారు. మూడు బ్యారేజీల వద్ద ఇసుక మేటల తొలగింపు, గ్రౌటింగ్ పనులు జరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు తాత్కాలిక చర్యలు, తదుపరి పరీక్షల అధ్యయనానికి కమిటీ - Kaleshwaram Project News Latest
Medigadda Barrage Updates :ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించిన తదుపరి పరీక్షలు నిర్వహించేందుకు కూడా నీటిపారుదలశాఖ కసరత్తు చేస్తోంది. వర్షాకాలానికి ముందే పరీక్షలు చేయాల్సి ఉండడంతో త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ - సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధులు మేడిగడ్డతో పాటు అన్నారం ఆనకట్టలను పరిశీలించారు. అందులో జియోటెక్నికల్ శాస్త్రవేత్త జేఎస్ ఎడ్లబడ్కర్, జియోఫిజికల్ శాస్త్రవేత్త ధనుంజయ నాయుడు, ఎన్డీటీ అధ్యయనాల శాస్త్రవేత్త ప్రకాష్ పాలేయి ఉన్నారు.
శనివారం లేదా సోమవారం హైదరాబాద్‌కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ - ఎన్ జీఆర్ఐ ప్రతినిధులు కూడా బ్యారేజీలను పరిశీలించనున్నారు. దిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ - సీఎస్ఎంఆర్ఎస్ ప్రతినిధులను కూడా ఇప్పటికే సంప్రదించారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు ఇవాళ సమావేశం కానున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. బ్యారేజీలకు నిర్వహించాల్సిన పరీక్షలు, సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చిస్తారు.
బ్యారేజీల నుంచి అవకాశం ఉంటే నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. ఎక్కువ వ్యయం కాకుండా జియో టెక్స్ టైల్స్ విధానం, గేబియన్ స్ట్రక్చర్స్ తదితర విధానాలను పరిశీలిస్తున్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ సమీపంలో ఆరు మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ ఉంచితే ఎత్తిపోతలకు వీలవుతుంది. అందుకు అవకాశం ఉన్న పద్ధతులను పరిశీలిస్తున్నారు.
జియో టెక్స్ టైల్స్ విధానంలో ట్యూబులు ఏర్పాటు చేయడం ద్వారా నీటిని నిల్వ చేయవచ్చని, ఖర్చు కూడా తక్కువ అవుతుందని అంటున్నారు. తాడిపూడి ప్రాజెక్టు సమీపంలో ఓ అక్విడెక్ట్ కోసం ఈ తరహా విధానాన్ని ఏళ్ల తరబడి ఉపయోగించినట్లు చెప్తున్నారు. శుక్రవారం జరగనున్న బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ల సమావేశంలో సదరు కంపెనీ ప్రతినిధులు ఇందుకు సంబంధించిన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాతిని ఉపయోగించి గేబియన్ స్ట్రక్చర్స్ ఏర్పాటు ద్వారా కూడా నీరు నిల్వ చేయవచ్చని అంటున్నారు. అన్ని అంశాలను పరిశీలించి నిపుణుల కమిటీ సలహా మేరకు వీటికి సంబంధించి చర్యలు తీసుకోనున్నారు.
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం - పియర్స్ దెబ్బతిన్న చోట తీసుకుంటున్న చర్యలపై ఆరా - CWPRS Experts Visit Medigadda Today
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ అప్డేట్ - ఏడో బ్లాక్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం - Medigadda Barrage Temporary Repairs